దుబ్బాక, ఫిబ్రవరి 19: కాంగ్రెస్ ప్రభుత్వం హంగు ఆర్భాటాలకే పరిమితమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దుబ్బాక పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద 20 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లకు యూనిఫాం (చీరలు) దుస్తులు అందజేశారు. అనంతరం స్థానిక రజినీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని దుబ్బాక మున్సిపల్, మండలంలో 60 మందికి, అక్బర్పేట-భూంపల్లి మండలంలో 39 మందికి, తొగుట మండలంలో 55 మందికి మొత్తం 154 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరువు కాటకాలకు నిలయమైన తెలంగాణను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేసి కాళేశ్వరంతో రైతులకు సాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కా్ంరగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీరు, గ్రామీణ ప్రజలకు తాగునీరు , కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఎన్నికల్లో ఓడిపోయిన, డిపాజిట్ రాని కాంగ్రెస్ నాయకులకు నిధులు కేటాయించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజారంజక పాలన అందించిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం అమలు చేసిందని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలు చేశారన్నారు. దివ్యాంగులకు నెలకు రూ. 4016 ఆసరా పింఛన్ మంజూరు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అస్క రవి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, తహసీల్దార్లు వెంకట్‌రెడ్డి, జయంత్, ఐసీడీఎస్ సీడీపీవో చంద్రకళ పాల్గొన్నారు.