సంగారెడ్డి నవంబర్ 2(నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్చెరు, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు స్వీకరించనున్నారు. వాటికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఆర్డీవో కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. అందోలు, పటాన్చెరులో తహసీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నామినేషన్ల ఏర్పాట్లును సమీక్షించిన కలెక్టర్ శరత్ గురువారం రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నియమావళికి అనుగుణంగా నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా జిల్లా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ రూపేశ్ పోలీసు అధికారులతో మాట్లాడుతూ నామినేషన్ల సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన పోలీసు సిబ్బందికి సూచించారు.
ఐదు నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులు ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. నామినేషన్ వేసే ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గంలో ఓటుహక్కు ఉండాలి. పక్క నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంటే అందుకు సంబందించిన పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు నాలుగు సెట్ల నామినేషన్లు వేయవచ్చు. జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి నామినేషన్ వేసే అభ్యర్థులు అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు అదే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రపోజ్ చేయాలి. ఎమ్మెల్యే నామినేషన్ వేసే అభ్యర్థులు వ్యక్తిగత వివరాలతో పాటు ఆస్తులు, కేసులకు సంబంధించిన వివరాలు తెలుపుతూ ఫామ్ 26తో పాటు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు డిపాజిట్‌గా రూ.5వేలు, సాధారణ అభ్యర్థులు రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే ఎమ్మెల్యే అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన బ్యాంకు ఖాతా ద్వారానే ఎన్నికలకు సంబంధించి ఖర్చులు ఇతర లావాదేవీలు చేపట్టాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే నామినేషన్ వేసే అభ్యర్థులు ర్యాలీ తీసుకునేందుకు పోలీసు శాఖ అనుమతిస్తుంది. అయితే ర్యాలీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వందమీటర్ల దూరంలోనే నిలిపివేయాలి. ఆ తర్వాత ఎమ్మెల్యే నామినేషన్ వేసే అభ్యర్థితోపాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అనుమతిస్తారు. ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో నామినేషన్ వేసేందుకు అనుమితి ఇస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసిన పక్షంలో అందుకు సంబంధించిన పత్రాలను రిటర్నింగ్ అధికారికి ప్రత్యక్షంగా అందజేయాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు చింతా ప్రభాకర్(సంగారెడ్డి), మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), భూపాల్‌రెడ్డి(నారాయణఖేడ్), చంటి క్రాంతికిరణ్(అందోలు), మాణిక్‌రావు (జహీరాబాద్) నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. టికెట్ దక్కిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకుంటున్న నాయకులు మంచిరోజులు చూసి నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.