కొల్చారం, జూన్ 15: వేతనాలు అందక పస్తులుంటున్నామని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ రాకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు నర్సమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ప్రజలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారని, అతి తక్కువ వేతనంతో ఆరుగాలం శ్రమిస్తున్నారన్నారు. ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా నిలిపివేయడంతో పంచాయతీ కార్మికుల కుటుంబాలు పస్తుండాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. మూడు రోజులపాటు పంచాయతీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళనకు దిగుతామన్నారు. కార్యక్రమంలో మల్లేశం, శేఖర్, యాదయ్య, భిక్షపతి, రాములు, ప్రభు, సురేఖ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.