రామాయంపేట, మే 23 : వేసవి కాలంలో తాటి ముంజల విక్రయాలు జోరందుకున్నాయి. రామాయంపేట పట్టణం, మండల వ్యాప్తంగా తాటి చెట్లు లేకు సుదూర ప్రాంతాల నుండి వాటిని తీసుకొచ్చి రామాయంపేటలో విక్రయాలు జరుపుతున్నారు. కేవలం వేసవి కాలంలోనే లభించే తాటి ముంజలకు డిమాండ్ ఏర్పడింది. పట్టణానికి ప్రతి రోజు పది మంది వరకు సైకిళ్లపై వచ్చి విక్రయాలు జరుపుతున్నారు. వంద రూపాయలకు 12నుండి 16 ముంజల వరకు విక్రయాలు జరుపుతారు. తాటి ముంజల కోసం రామాయంపేటకు వివిధ గ్రామాల నుండి వచ్చి కొనుగోలు చేస్తారు. తాటి ముంజలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని వైద్యులు సైతం చెబుతుంటారు.
ముఖ్యంగా తాటి ముంజలు తింటే మలబద్దకాన్ని పూర్తిగా నివారిస్తుంది. వీటిలో అనేక పోషక గుణాలు ఉంటాయి. ఇవి తిన్న వారికి చర్మాన్ని హైడ్రేట్ చేసి మరింత అందంగా కనిపించేందుకు సహాయప డతాయని వైద్యులు చెబుతున్నారు. కాగా, తాటి ముంజలు కామారెడ్డి జిల్లాలోనే ఎక్కువ శాతం తాటి చెట్లు ఉన్నాయి. ఇక్కడ విక్రయించే వారు కూడా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలకు చెందిన యాడారం గ్రామానికి చెందిన పదుల సంఖ్యలో సైకిల్‌పైన వచ్చి పట్టణంలోని ప్రధాన కేంద్రాల వద్ద నిలబడి వీటి విక్రయాలు జరుపుతున్నారు.