చేర్యాల, ఫిబ్రవరి 2: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించినప్పుడు సమస్యలను నోటు చేసుకుని ఒక్కొక్కటిగా పరిష్కారానికి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు, విజ్ఞప్తి చేస్తూ నిధులు మంజూరు చేయిస్తున్నారు.
ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఒక భాగమేనని మర్చిపోయిన అధికార పార్టీ నేతలు తామే మంజూరు చేయించామని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు లు పెడుతుంటే వాటికి ధీటుగా బీఆర్ఎస్ సైనికులు ఎమ్మెల్యే పల్లా ఏరోజు ఏఅధికారిని కలిశాడు, వినతిపత్రం అందించి విజ్ఞప్తి చేశాడనే వివరాలతో కూడిన పత్రాలతో పాటు మంజూ రు చేయించిన జీవోలను సైతం ఆదివారం విలేకరులకు అందజేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసి అధికారపక్ష నాయకులకు షాక్ ఇచ్చారు.
నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్టతో పాటు నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట మండలాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.11కోట్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ఎమ్మెల్యే కృషిని అభినందిస్తూ చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు చేర్యా ల పట్టణానికి తరలివచ్చి ఎమ్మెల్యే పల్లా ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని అధికార పార్టీ నేతలు తక్కువగా అంచనా వేస్తున్నారని, ఆయన నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు.అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అదేపనిగా వాట్సాప్ గ్రూపుల్లో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిస్తూ విద్వేశాలను రెచ్చగొడుతున్నారని, వెంటనే వాటిని మానుకోవాలని లేని పక్షంలో తగు విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.కార్యక్రమంలో చేర్యాలటౌన్, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.