కొమురవెల్లి, అక్టోబర్ 13 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లితో పాటు ఐనాపూర్, కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ఐకేపీ నిర్వాహకులు, రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు బోనస్ రూ.500 చెల్లిస్తామని ప్రకటించిందని, అధికారంలో వచ్చిన తర్వాత కేవలం సన్న వడ్లకు మాత్రమే రూ.500 చెల్లిస్తున్నద ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ రూ.500 చెల్లించడంతో పాటు సన్నవడ్లకు పెండింగ్‌లో ఉన్న బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అధికారులతో సమీక్షించి 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అవి ఇప్పటికీ కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. 2014కు ముందు తెలంగాణ సాగు విస్తీర్ణంలో 14 స్థానంలో ఉంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోస్థానానికి తీసుకువచ్చారన్నారు. వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణను మొదటి స్థానం లో నిలిపారన్నారు.
ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగాల్సిన అవసరం ఉందని, దానికి కావాల్సిన సాగునీరు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఏదైనా రైతుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు వెంటనే కనెక్ట్ చేసి ఎలాంటి దోపిడీ లేకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయాలన్నారు. మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా అధికారులు నిఘా పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఐకేపీ నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు ధా న్యం కొనుగోలు కేంద్రానికి సింగిల్ ఫేజ్ కరెం ట్ కావాలని ఎమ్మెల్యే పల్లాను కోరగా స్పందించిన ఆయన విద్యుత్‌శాఖ ఏడీ వెంకట్‌కు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రానికి సింగిల్ ఫేజ్ కరెంట్ వెంటనే ఇవ్వాలని, అవసరమైన నివేదిక అందించాలని కోరారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు ఆలస్యంగా రావడంతో ఎడమ, కుడి కెనాల్ ద్వారా లీకేజ్ అవుతూ వృథాగా నీరు పోతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు వచ్చిన నీరు వృథాగా పోతున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు అవసరం ఉన్నప్పుడు నీళ్లు అందడం లేదని విమర్శించారు. వెంటనే తపాస్‌పల్లి రిజర్వాయర్ నీళ్లు లీకేజ్ కాకుండా మరమ్మతులు చేయడంతోపాటు స్టోరేజీ చేసి యాసంగి పంటలకు సాగు నీరు అందించాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భిక్షపతి, మాజీ ఎంపీపీ కీర్తనాకిషన్, మాజీ జడ్పీటీసీ సిద్ధప్ప, మాజీ వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు విజేందర్, పచ్చిమడ్ల స్వామిగౌడ్, బీమనపల్లి కరుణాకర్, పడిగన్నగారి మల్లేశం, గొల్లపల్లి కిష్టయ్య, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్‌రెడ్డి, ఏర్పుల మహేశ్, కొండ శ్రీధర్, ముత్యం నర్సింహులు, బుడిగె గురువయ్యగౌడ్, పుట్ట కనకరాజు పాల్గొన్నారు.