మెదక్‌రూరల్, అక్టోబర్ 27: మెదక్ జిల్లా మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యారాణి, చందన ఈ నెల 24న కర్నూల్ బస్సు ప్రమాదంలో సజీవదహనమై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం మృతిదేహాలను కుటుంబసభ్యులు సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చారు.
బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శివ్వాయిపల్లి గ్రామానికి చేరుకుని మృతి దేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో తల్లీబిడ్డ సజీవదహనం బాధాకరమన్నారు. వారివెంట బీఆర్ఎస్ మెదక్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, నాయకులు కిష్టయ్య, సిద్ధయ్య, రవీందర్, గురుమూర్తిగౌడ్ ఉన్నారు.
మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన చింత కింది శ్రీకృష్ణ , బీరయ్య ఇటీవల మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సోమవారం గ్రామానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇరు కుటుంబాలకు రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. తన కుమారుడు మృతి చెందాడని, పేదవాడినని అదే గ్రామానికి చెందిన బీరయ్య చెప్పగానే స్పందించి రూ . 5వేలు అందజేశారు.
కోంటూరుకు చెందిన నరేశ్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేలు, వెల్మకన్నేపుష్ప మనుమడు మృతిచెందగా రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం బస్సు ప్రమాదంలో సజీవదహనమైన శివాయిపల్లికి చెందిన తల్లీకూతుర్లు సంధ్యారాణి, చందన మృతిదేహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, నవీన్, ప్రభాకర్, రాము లు, ప్రభాకర్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.