మెదక్, జూలై 9(నమస్తే తెలంగాణ): బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి స్థాయి దిగజారి మాట్లాడడం తగదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని, అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే కేసు నమోదు చేయాలని బుధవారం మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రావు గతంలో సైతం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయగా అప్పట్లో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల మరోసారి ఆయన ఓ చానల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని, ఇలా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా, భయభ్రాంతులకు గురిచేసినా బయపడడానికి ఇకడ ఎవరూ లేరని, బీఆర్ఎస్ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమని ఎమ్మెల్యేను పద్మాదేవేందర్‌రెడ్డి హెచ్చరించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను ఇండ్ల నుంచి గుంజుకొచ్చి బట్టలూడదీసి కొడుతామని అసభ్యకర పదజాలంతో ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడారని, కేసీఆర్ అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై చట్టపరమైన కేసు నమోదు చేయాలని ఎస్పీకి పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పదేండ్ల పాటు సీఎంగా సేవలందించిన కేసీఆర్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడడమే కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను చంపుతామంటూ మెదక్ ఎమ్మెల్యే అనుచరులు అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ నానా హంగామా సృష్టించారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారికి ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినా పూర్తి బాధ్యత మెదక్ ఎమ్మెల్యేదే అని ఆమె అన్నారు.
పద్మాదేవేందర్‌రెడ్డి వెంట రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, న్యాయవాది జీవన్‌రావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు విశ్వం, కిశోర్ ఆరే శ్రీనివాస్, జయరాజ్, మాయచ మల్లేశం, మెదక్, హవేళీఘనపూర్, నిజాంపేట్ మండలాల పార్టీ అధ్యక్షులు అంజా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు లింగారెడ్డి, కృష్ణాగౌడ్, బట్టి.ఉదయ్, సాయ గౌడ్, అహ్మద్, రంజా, నారాయణ, ఉమా మహేశ్వర్, సాప సాయిలు, శ్రీను నాయక్, స్వామి నాయక్, రంజిత్, లక్ష్మణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.