రామాయంపేట / నిజాంపేట, జూన్ 5: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో మొలకెత్తిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పద్మాదేవేందర్‌రెడ్డితో వారి గోడు వెల్లబోసుకున్నారు. ఒక్క గ్రామం లోనే రోడ్డు పొడవునా 2కిలోమీటర్ల మేర ధాన్యం కుప్పలు ఉండడం చూసి ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.
వానకాలం వచ్చినా ప్రభుత్వం ధాన్యం కొనకుండా ఏం చేస్తున్నట్లు ప్రశ్నించారు. రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి రెండు నెలలు కావస్తున్నదని, ఇంకెప్పుడు ధాన్యం కొంటారని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. రాయిలాపూర్‌లోని మూడు కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, ఎక్కడి ధాన్యం అక్కడే ఉందన్నారు. అక్కడి నుంచే మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌తో పద్మాదేవేందర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. రైతులతో సర్కా రు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పద్మాదేవేందర్‌రెడ్డి రాయిలాపూర్ నుంచి కార్యకర్తలతో 3కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చి క్రాస్ రోడ్డు వద్ద సిద్దిపేట-రామాయంపేట రోడ్డు రాస్తారోకో చేశారు. రైతుల ధాన్యం కొనే వరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు.
రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్క డే నిలిచిపోయాయి. రామాయంపేట, ని జాంపేట ఎస్సైలు బాలరాజు, రాజేశ్ వచ్చి ఎంత సముదాయించినా పద్మాదేవేందర్‌రెడ్డి ససేమిరా అన్నారు. ఎస్సై బాలరాజు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారితో ఫోన్లో మాట్లాడించారు. ఈ రోజు రాత్రివరకు ఐదు లారీలు పంపిస్తామని ఫోన్లో తహసీల్దార్ మాజీ ఎమ్మెల్యేకు తెలిపారు. ఒకవేళ లారీలు రాకుంటే మళ్లీ రేపు వచ్చి రాస్తారోకో చేపడతానని పద్మాదేవేందర్‌రెడ్డి హెచ్చరించారు. కచ్చితంగా లారీలను పంపిస్తానని తహసీల్దార్ చెప్పడంతో పద్మాదేవేందర్‌రెడ్డి రాస్తారోకో విరమించారు. రామాయంపేట, నిజాంపేట మండలాల రైతులు, బీఆర్ఎసస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క రాయిలాపూర్లోనే రోడ్డు పొడవునా 2కిలోమీటర్ల మేర ధాన్యం కుప్పలు మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయని, 20 లారీలకుపై వడ్లు కుప్పలుగా నిల్వ ఉండి వానకు తడస్తున్నట్లు చెప్పారు. మరో మూడు రోజుల్లో మృగశిర కార్తె రానుందని, వర్షాలు కురుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రాయిలాపూర్‌లోని మూడు కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతుంటే, మెదక్ ఎమ్మెల్యే ఎక్కడి పోయారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు రైతుల సమస్యలు పట్టవని విమర్శించారు.
రెండు నెలలుగా రైతులు వడ్లతో రోడ్లపై ఉంటే, ఎమ్మెల్యేకు కనీసం పట్టడం లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్‌కు రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు. రాస్తారోకోలో రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, సీనియర్ నాయకుడు చౌదరి సుప్రభాతరావు, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మద్దెల రమేశ్, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, ఉమామహేశ్వర్, అబ్దుల్ అజీజ్, అస్నొద్దీన్, మధుకర్, బాల్‌రెడ్డి, బాసం శ్రీనివాస్, నర్సాగౌడ్, భిక్షపతి, బసన్నపల్లి మల్లేశం, సార్గు సత్యనారాయణ, సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్‌గౌడ్, మండల కో-ఆప్షన్ మాజీ సభ్యుడు అబ్దుల్ అజీజ్, నాయకులు శ్రీకాంత్‌గౌడ్, లక్ష్మణ్, రాజుగౌడ్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.