రామాయంపేట, జూన్ 14: పాలన చేతగాక కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ముంబయిలో సముద్రంలో గల్లంతై మరణించిన వ్యక్తి కుటుంబాన్ని శనివారం రామాయంపేటలో పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నర్సింలు కుటుంబానికి బీఆర్ఎస్ నుంచి రూ.2లక్షల చెక్కు మృతుడి భార్యకు అందజేశారు.ఇటీవల నారోగ్యానికి గురైన బీఆర్ఎస్ కార్యకర్త పరుపుగల్ల యాదగిరిని పరామర్శించారు.
అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట 420 హామీలిచ్చి నేడు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. వానకాలం వచ్చినా రైతుభరోసాకు దిక్కులేదన్నారు. కక్షసాధింపుల్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని, అధికారులకు సమాధానం చెప్పి వచ్చినప్పటికీ మళ్లీ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఆమె వెంట రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, ఐలయ్య, ఎస్కే హైమద్, అస్నోద్దీన్, కృష్ణాగౌడ్, చింతల రాములు, రాజు యాదవ్, ముత్తరగల్ల కిషన్, నిజాంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మల్లేశం, సుభాష్ నాయక్, కొండల్‌రెడ్డి, ఉమామహేశ్వర్ ఉన్నారు.