మెదక్, జూలై 31(నమస్తే తెలంగాణ) : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ మండలం రాయినపల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కూలిపోగా, చెరువు కట్ట కూడా సగానికి పైగా దెబ్బతినడంతో ఏడు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం చెరువు కట్టను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయకుండా తాత్కాలిక పనులతో సరిపెట్టడంతోనే నేడు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పూర్తిగా కూలిపోయిందని ఆరోపించారు.
మూడు రోజుల వర్షాలకే కాల్వ కట్ట, చెరువు కట్ట దెబ్బతినడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఏడు గ్రామాలకు ప్రత్యక్షంగా, మరో పది గ్రామాలకు పరోక్షంగా నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం కాల్వ దెబ్బతినడంతో రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రెండు నెలల క్రితమే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి మరమ్మతులు చేపట్టాలని కోరినా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కెనాల్ పూర్తిగా కొట్టుకుపోవడంతో చెరువు కట్టకూ పెను ముప్పు ఏర్పడిందని, కామారెడ్డి జిల్లా దంతేపల్లి వైపు నుంచి వరద ప్రవాహం పెరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే ఏడు గ్రామాల ప్రజలు, రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో స్వయంగా కట్టను పూడ్చే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మెదక్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు యం.అంజ గౌడ్ మాజీ ఎంపీపీ కిష్టయ్య, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, నాయకులు న్యాయవాది జీవన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగ నరేందర్,రాయన్ పల్లి మాజీ సర్పంచ్ నాగులు, పార్టీ అధ్యక్షులు జంగం వీరస్వామి, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ. ఆంజనేయులు నాయకులు బాలయ్య నర్సాగౌడ్ నర్సింలు, దుర్గయ్య, కిష్టయ్య సిద్ధిరాములు,శీను భాస్కర్, యాదగిరి శ్రీధర్, రైతులు తదితరులు ఉన్నారు.