మెదక్ మున్సిపాలిటీ, జూలై 18: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. కేసీఆర్, హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యల్లో ఆవగింజంతైనా నిజాలు లేవని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. గురువారం మెదక్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే నీకు పీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడి నుంచి వచ్చేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు కోసం నీ స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నావని, ఇకనుంచైనా అలాంటి మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని నువు ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, హారీశ్‌రావును తిట్టడంలో ఉన్న శ్రద్ధ, రైతులకు యూరియా అందించండంలో చూపించాలన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు రాజకీయ అనుభవం ముందు నువ్వెంత అన్నారు. 19 నెలల పాలనలో రూ. 20 లక్షల కోట్ల అప్పు తెచ్చిన మీ ప్రభుత్వ పాలన ఏమిటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి కేవలం 4 లక్షల 20 వేల కోట్ల అప్పు తెచ్చిన కేసీఆర్‌ను తప్పుబట్టడానికి సిగ్గుండాలన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రియాంకాగాంధీతో యూత్ డిక్లరేషన్ విడుదల చేయించిన మీరు 11 వేల ఉద్యోగాలు సైతం ఇవ్వలేదన్నారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న మీరు వాటిలో 50 వేల ఉద్యోగాలు కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు చెందినవేనని గుర్తుచేశారు.
ప్రతి నెలకు రూ.10 వేల కోట్ల అప్పు తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబ్బులను ఎక్కడికి మళ్లీస్తుందో మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రజాదర్బర్ పెట్టి రోజూ ప్రజలను కలుస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోతల మాటలపై మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడాలన్నారు. నదీజలాల్లో రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి చేస్తున్న ద్రోహాన్ని అంకెలతో బయటపెట్టినందుకే హరీశ్‌రావుపై రంకెలు వేస్తున్నారన్నారు.
రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం తిరుగుతుంటే రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్ రాజకీయ కట్టుబాట్లు దాటి ప్రవర్తిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ మెదక్ జిల్లా బిడ్డ, మెదక్ ప్రజలకు ఎవరేమిటో తెలుసు.. నిజామాబాద్ నుంచి వచ్చిన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మెదక్‌కు జిల్లా కేంద్రం, మెడికల్ కళాశాల తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. మైనంపల్లి హన్మంత్‌రావు ఉడత ఊపులకు భయపడే వారు ఎవరూ లేరన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్ ఏమి చేస్తారో చెప్పలేదన్నారు.