మెదక్ మున్సిపాలిటీ, జనవరి 30: సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తీరా హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేక పోయిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం మెదక్ జిల్లాకేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి తదితరులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారం కోసం కాంగ్రెస్ మాయమాటలు చెప్పిందని, అలవి కాని హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయకుండా డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నదని, కానీ.. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. రూ.4 వేల పింఛన్, తులం బంగారం, రైతుభరోసా రూ. 15 వేలు ఇలా అనేక హామీలను విస్మరించిందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రశ్నించే గొంతుకలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేసేలా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షాన పోరాడుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్నివర్గాలకు మేలు జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలన మూడు దందాలు, ఆరు సెటిల్మెంట్లుగా కొనసాగుతుందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చేతులెత్త్తేసిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి విమర్శించారు. అధికారం కోసం మోసపూరిత హామీలిచ్చి, ఇప్పుడు పొంతన లేకుండా మాట్లాడాడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని తెలిపారు. హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చేస్తున్నదన్నారు. కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసిన రైతన్నలు, కాంగ్రెస్ పాలనలో ఆగమై పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కరెంట్, సాగునీటి కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడినట్లు తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయలు, కో కన్వీనర్లు గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, కిశోర్, రబ్బీ, చంద్రకళ, చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు అంజాగౌడ్, ప్రభురెడ్డి, బట్టి ఉదయ్, మేడిశెట్టి శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, శ్రీకాంత్, జుబేర్, మోచి కిషన్, అరుణ్, కిరణ్, శ్రీనివాస్‌గౌడ్, మధు, రాజు, నరేష్, వినోద్ పాల్గొన్నారు.