మెదక్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): మెదక్ నుంచి మక్తా భూపతిపూర్‌కు వెళ్లే బ్రిడ్జి మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని, పొలాల్లో ఇసుక మేటలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెదక్ మండలంలోని రాయిన్‌పల్లి ప్రాజెక్టు కింద కొట్టుకుపోయిన కాలువల మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలన్నారు. భారీ వర్షాలకు పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడి రైతులు నష్టపోయారని, ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ నుంచి మక్తభూపతిపూర్ వెళ్లే దారిలో పుష్పలవాగు వంతెన పరిసరాలు కోతకు గురై 23 రోజులుగా 7 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కోరారు.
లేకుంటే పార్టీ తరపున ధర్నా చేస్తామని హెచ్చరించారు. రాయిన్‌పల్లి ప్రాజెక్టు వద్ద నాలుగు, పది హెచ్‌పీ మోటర్లు ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్నారు. మెదక్ మండలం గుట్టకిందిపల్లికి చెందిన చింతల వెంకట్ భార్య చింతల రేణుక ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం చింతల వెంకట్‌ను మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శించారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, నాయకులు కృష్ణారెడ్డి, అంజాగౌడ్, మామిళ్ల ఆంజనేయులు, ఆరే శ్రీనివాస్, భీమరి కిశోర్, కృష్ణగౌడ్, లింగారెడ్డి, కిష్టయ్య, గట్టయ్య, ప్రభురెడ్డి, సిద్దయ్య, షాకీర్, మోహన్ నాయక్, రవీందర్, బాలేశ్, నాగమల్లు, శంకరయ్య, నాగరాజు, కండెల రవి, శంబీపూర్ మహేశ్, రైతులు పాల్గొన్నారు.