రామాయంపేట/చేగుంట, నవంబర్ 5: అన్ని గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యాలని, ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రెండు రోజుల్లో ధాన్యం కాంటా పెట్టకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం రామాయంపేట,చేగుంట మండలాల్లో ఆమె పర్యటించారు. రెం డు మండలాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటున్నదని విమర్శించారు. రేవంత్ సర్కార్‌లో రైతులకు కష్టాలే తప్ప మేలు జరగడం లేదన్నారు. ప్రభుత్వం తూతూమంత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం సేకరించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు పోయేకా లం దగ్గర పడిందన్నారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తానని గొప్పలు చెప్పుడు తప్ప ఇప్పటి వరకు ఏ రైతుకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పద్మాదేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలన్నారు. మ్యాచర్ పేరిట ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇలాగే మొండికేస్తే రైతులతో ఆందోళనలు చేపడతామని, రోడ్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, కౌన్సిలర్ అనిల్‌కుమార్ ఉన్నారు.
నార్సింగి మండలం జెప్తిశివునూర్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్ల మీద ఆరబట్టిన ధాన్యం వర్షానికి తడిసి, ముక్కిన వడ్ల కుప్పలను మంగళవారం పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె వెంట నార్సింగి, చిన్నశంకరంపేట బీఆర్ఎస్ మండలాల పార్టీ అధ్యక్షులు మైలరాం బాబు, పట్లోరి రాజు, మాజీ వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత శంకర్, కాసులపూర్ యాదగిరి, గొండ స్వామి, రైతులు ఉన్నారు.