మెదక్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థుల పై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం బీఆర్ఎస్ మెదక్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నంచే గొంతుకలను అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి మంత్రిని వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీచార్జి చేయడంపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలన్నారు. దేశ వ్యాప్తంగా పారదర్శకంగా నీట్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.