న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శనివారం లోగా(2సెప్టెంబర్ 26) తన పదవికి రాజీనామా చేయకపోతే అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలు చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శుక్రవారం ప్రకటించింది. గాంధీ జయంతి నాడు(అక్టోబర్ 2) ముంబైలో ఈ ఆందోళన ప్రారంభమై ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు విస్తరిస్తుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా తెలిపారు.
రిగ్గింగ్ జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడం ఆ ప్రక్రియకు చట్టబద్ధతను కల్పిస్తుందని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగాయనే భావాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోతామనే భయంతోనే విపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతున్నదని విశ్వసిస్తుంటే ఎన్నికల్లో పోటీ చేయడం నిలిపివేయాలని ఆయన ప్రతిపక్షపార్టీలకు పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో సంబంధిత రాష్ట్రం లేదా రాజకీయ పార్టీని బట్టి కాకుండా ప్రతిపక్ష పార్టీలు స్థిరమైన వైఖరిని అవలంబించాలని కూడా ఆయన సూచించారు. తమ రాజకీయ మనుగడ కంటే దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య హితానికే ప్రాధాన్యత ఇవ్వాలని విపక్ష పార్టీలను ఆయన కోరారు.
ఎన్నికల్లో ప్రతిపక్షం నిరంతరం పాల్గొనడాన్ని దీప్కే ఒక ఫిక్స్డ్ మ్యాచ్(ముందే ఫలితం నిర్ణయించిన ఆట)తో పోల్చారు. అటువంటి పోటీలో కూడా ప్రతి క్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా వదిలేయరని, పైకి నిజమైన పోటీలా కనిపించేలా ఆటను చివరి ఓవర్ వరకు కొనసాగనివ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.