వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గతంలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టిన విషయం తెలిసిందే. మోదీ సర్కారు సవాలక్ష అడ్డంకులు సృష్టించినా, సీఎం కేసీఆర్ రైతులు నష్ట పోవద్దని గత సీజన్లో వడ్లు కొన్నారు. ఈసారి సైతం ప్రభుత్వం అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏ-గ్రేడ్ ధాన్యం రూ.2060, బీ- గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం రూ.2040 మద్దతు ధర నిర్ణయించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 927 కొను గోలు కేంద్రాల ఏర్పాటు చేయగా, అధికారులు 12,70,645 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, సిద్దిపేట జిల్లాలో ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉమ్మడి జిల్లా అధికారులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై దిశానిర్దేశం చేశారు. తేమ 17 శాతానికి మించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంట చేతికి రావడంతో వచ్చిన ధాన్యం వచ్చినట్లుగా కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, సిద్దిపేట జిల్లాలో ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఇక్కడ ఇప్పుడిప్పుడే ధాన్యం రావడంతో కేంద్రాలను ప్రారంభించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లుగా తూకం వేసి మిల్లులకు తరలించే విధంగా అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నది. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండడంతో ఇవాళ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
విత్తనం నుంచి పంట విక్రయించే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటున్నది. రైతులు పండించిన ధాన్యంలో స్థానిక అవసరాలకు పోను మిగిలిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా అధికారులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. మహిళా సంఘాలు, సొసైటీలు, ఏఎంసీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే ట్యాగింగ్ చేసిన మిల్లులకు లారీల ద్వారా తరలించి, ట్రక్ షీట్ వచ్చిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులను ఇన్చార్జిలుగా నియమించి ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడే విధంగా గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు , వేయింగ్ మిషన్. తేమ మిషన్లను అందుబాటులో పెడుతున్నారు. తేమ 17శాతం మించకుండా, ఎఫ్‌సీఐ ప్రమాణలకు అనుగుణంగా నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 12,70,645
మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం
ఉమ్మడి మెదక్ జిల్లాలో 12,70,645 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 955 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఏ-గ్రేడు ధాన్యం రూ.2060, బీ- గ్రేడ్ ధాన్యాన్ని రూ.2040గా ప్రభు త్వం నిర్ణయించింది. ఈ ధరలకు అనుగుణంగా ధా న్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 3,61,090 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. జిల్లాలో9,13,300 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా కాగా, దీనిలో స్థానిక అవసరాల కు పోను 5,00,645 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తారు. సంగారెడ్డి జిల్లాలో 1,39,000 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 3,30,000 మెట్రిక్ టన్నుల ధా న్యం అంచనా కాగా, 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తారు. మెదక్ జిల్లాలో 2,94,744 ఎకరాల్లో వరి పంటసాగుచేశారు. 6,79,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అంచనా కాగా, 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో 955 కొనుగోలు కేంద్రాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 955 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన చోట ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరిన్ని పెంచడానికి సైతం అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అవసరమైన గోడౌన్లను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో టార్పాలిన్ కవర్లు 13,689 అవసరం కాగా, జిల్లాలో 9,489 ఉన్నాయి. ఇంకను 4,200 అవసరమవుతాయి, పాడీ క్లీనర్స్ 613కుగాను 575 అందుబాటులో ఉన్నాయి. తేమ మిషన్లు 539కు 451 ఉన్నాయి. వేయింగ్ మిషన్లు 708కు 681 ఉన్నాయి. జిల్లాలో మొత్తం 411 కొనుగోలు కేంద్రాలకు వీటిలో ఐకేపీ 225, పీఏసీఎస్ 174, మెప్మా 5, మిగిలిన ఏడు కేంద్రాలను ఇతర వాటికి సర్దుబాటు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో రెండు రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ 386 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు మూడు రోజుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ జిల్లాలో 158 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లాలో డీసీఎంఎస్ 14, పీఏసీఎస్ 74, ఐకేపీ 70 మొత్తం 158 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలుగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు. ఏ రైతు మీద ఎంత సాగైంది అనే వివరాలు వ్యవసాయశాఖ పోర్టల్‌లో పొందుపర్చారు. దీని ఆధారంగా రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించనున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ప్రధానంగా ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్‌లో జాప్యం జరుగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.