ఓవైపు పెరిగిన ఎండల తీవ్రత..మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలు..వెరసి పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మెదక్ జిల్లాలో రైతులను కదిలిస్తే కంట నుంచి కన్నీరే వస్తున్నది. ఎండిన వరిపంట పశువులకు మేతగా మారుతోంది. అప్పులు చేసి వరి సాగు చేయగా, పొట్టదశలో ఉన్న పంట దెబ్బతింటున్నదని రైతులు వేదనకు గురవుతున్నారు. కండ్ల ముందే పంట ఎండుతుండడంతో రైతుల గుండె తరుక్కుపోతున్నది. ఎండిన వరి పొలాల్లో పశువులను మేపుతున్నారు. వరి పంటనే కాకుండా కూరగాయల పంటలకు సైతం పారకం పెడదామంటే బోర్ల నుంచి నీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు.
మెదక్, మార్చి 3(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లోని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఎకువ శాతం బోరుబావుల కింద రైతులు యాసంగి పంటలు సాగుచేశారు. సరిగ్గా నీరందక పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. గడిచిన వానకాలంలో భారీ వర్షాలకు జిల్లాలో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లాయి. భారీ వర్షాలకు కొన్ని ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి చేతికి రాకుండా నేలపాలైంది. చెరువులు, కుంటలను జలకళను సంతరించుకోవడంతో రైతులు యాసంగిపై ఆశలు పెంచుకున్నారు. వరి సాగు వైపు మొగ్గు చూపారు. ఫిబ్రవరి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు అడుగంటడం ప్రారంభమైంది. వరికి సరిపడా నీరందించలేక రైతులు అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుకనీరు పడకపోవడంతో దికుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక నెర్రెలు వారిన పొలాల్లో పశువులను మేపుతున్నారు.
పొట్ట దశలో మాడిపోతున్న వరి…
మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 2,58,487 ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. ఇతర పంటలు 800 ఎకరాల్లో రైతులు వేశారు. ఇందులో వ్యవసాయ బావులు, బోరుబావుల కింద దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంటను సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. వ్యవసాయ బోర్ల వద్ద సాగుకు నీరందకపోవడంతో పొట్ట దశకు చేరిన వరి ఎండలకు మాడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈసారి దిగుబడులు ఎక్కువగా వస్తాయని రైతులు ఆశించారు. కానీ, వారి ఆశలు అడియాశలు అయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావుల్లో నీరు రాకపోవడతో పొట్ట దశకు వచ్చిన వరిని కాపాడుకోలేక పోతున్నారు.