సంగారెడ్డి, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ) : ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా ఆదివారం తడిసి ముద్దయ్యింది. రోజంతా జడివాన కురియడంతో జనజీవనం స్తంభించింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 6.8 సెం.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. 10 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 14 మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షం కురిసింది.
అందోలు మండలంలో అత్యధికంగా 9.8 సెం. మీటర్ల వర్షపాతం నమోదైంది. సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల్లోకి వరద వస్తున్నది. జహీరాబాద్ సమీపంలోని నారిం జ ప్రాజెక్టు పూర్తిగా నిండి ఉప్పొ ంగి ప్రవహిస్తున్నది. జిల్లాలోని గంగకత్వ, మామిడివాగు, జీర్లపల్లి తదితర వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలతోకు జిల్లాలోని 20 చెరువులు మత్తడి దూకాయి. పలు గ్రామాల్లో పంట చేలు నీటమునిగాయి.
అందోలు మండలం కిచ్చనపల్లివద్ద రోడ్డుపక్కగా ఉన్న చెట్టు కొమ్మ విరిగిపడటంతో నారాయణఖేడ్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు గాయాలు కాలేదు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని కలెక్టర్ క్రాంతి రద్దు చేశారు.
వర్షాలకు కొత్తూరు(బి)లోని నారింజ వాగు ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 85 ఎంసీఎఫ్‌టీలు కాగా, ప్రాజెక్టు పూర్తిగా నిండి ఉప్పొంగి ప్రవహిస్తూ దిగువన కర్ణాటకలోకి వరద పోతున్నది. న్యాల్కల్ మండలంలోని మామిడివాగు ఉప్పొంగి ప్రవహించడంతో రేజింతల్-ఎల్గోయి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
న్యాల్కల్ మండలంలోని హద్నూర్, రేజింతల్, రుక్మాపూర్, ఖలీల్పూర్, మిర్జాపూర్‌లో పంటలు పత్తి, మినుము, పెసర, సోయాబీన్ పంటలు నీటమునిగాయి. ఝరాసంగం మండలంలోని పేరవరం వాగు ఉప్పొంగడంతో బొప్పన్పల్లి-పేరవరం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వర్షాలతో జీర్లపల్లి, పేరవరం గ్రామాల్లో పత్తి ఇతర పంటలు నీట మునిగాయి. సదాశివపేట మండలంలోని గంగకత్వ వాడు ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి 15622 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.298 టీఎంసీలకు చేరుకుంది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులోకి 1428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటిమట్టం 746 ఎంసీఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం నీటి మట్టం 471 ఎంసీఎఫ్‌టీకి చేరుకుంది.
వర్షాలతో జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువు అలుగు పారుతున్నది. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని పెద్దచెరువు, అందోలులోని అన్నసాగర్ చెరువు నిండుతున్నాయి. జిల్లాలో మొత్తం 1769 చెరువులకు 20 చెరువులు అలుగు పారుతున్నాయి. 15 చెరువులు నీటితో నిండాయి. 358 చెరువుల్లోకి 75 శాతం, 850 చెరువుల్లోకి 50 శాతం వర్షంనీరు వచ్చి చేరింది.