సిద్దిపేట, సెప్టెంబర్ 2:మూడు రోజులుగా సిద్దిపేట జిల్లా లో జోరుగా వర్షం కురుస్తోంది. సోమవారం కొంత వర్షం ఎడతెరిపి ఇవ్వడంతో ప్రజలు తమ పనులకు వెళ్లారు. శనివారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి, చెక్‌డ్యామ్‌లు అలుగులు పారుతున్నాయి. కూడవెళ్లివాగు, మందపల్లివాగు, అక్కెనపల్లి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
నంగునూరు పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో ఖాతా,ఘన్పూర్ గ్రామాలకు రాకపోకలు స్తం భించాయి. వాగులు ప్రవహిస్తుండటంతో పోలీసులు సమీప ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులను అటు వైపు వెళ్లవద్దని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోగా మరికొన్ని ధ్వంసమయ్యాయి. సిద్దిపేటతో వరద నీరు నివాసప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బెజ్జంకి మండలం తోటపల్లివాగులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సిద్దిపేట పట్టణంలో ఐదు ఇండ్లు కూలిపోయాయి.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో అత్యధికంగా 16.63 సెంటీ మీటర్ల వర్షపాతం, అత్యల్పంగా హుస్నాబాద్‌లో 0.15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే మిరుదొడ్డిలో 16.6 సెం.మీ, సిద్దిపేట రూరల్‌లో 14.6 సె.మీ, నారాయణరావుపేట మండలంలో 14.5 సెం.మీ, కొండపాకలో 11.9 సెం.మీ,ధూళిమిట్టలో 11.3 సెం.మీ, తొగుటలో 10.9 సెం.మీ, దుబ్బాకలో 10.7 సెం.మీ, కుకునూరుపల్లిలో 10.6 సెం.మీ, మ ద్దూరులో 10.5 సెం.మీ,
అక్కన్నపేటలో 10.4 సెం. మీ, మర్కూక్‌లో 10.1 సెం.మీ, నంగునూరులో 9.70 సెం. మీ, కోహెడలో 9.58 సెం.మీ, సిద్దిపేట అర్బన్‌లో 9. 20 సెం.మీ, గజ్వేల్‌లో 9.19 సెం.మీ, జగదేవ్‌పూర్ లో 9.14సెం.మీ, కోమురవెళ్లిలో 9.05 సెం.మీ, చిన్నకోడూరులో 8.78సెం.మీ, దౌల్తాబాద్‌లో 8.15 సెం. మీ, వర్గల్లో 6.88 సెం.మీ, చేర్యాలలో 5.57 సెం.మీ, ములుగులో 5.41 సెం.మీ, రాయపోల్‌లో 4.44 సెం. మీ,అక్బర్పేటభూంపల్లి మండలంలో 4.40 సెం. మీ, బెజ్జంకిలో 1.70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.