మెదక్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి ప్రారంభమైన వర్షం ఆదివారం వరకు విరామం లేకుండా కురిసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. చెరువులు, కుంటలతో పాటు చెక్‌డ్యామ్‌లు అలుగు పారుతున్నాయి.
రోడ్లన్నీ జలమయంగా మారాయి. మెదక్‌లో అత్యధికంగా 78.4 మీ.మీ, అత్యల్పంగా మనోహరాబాద్ మండలంలో 31.6 మీ.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్ జిల్లాలో ఇదే భారీ వర్షం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లోకి పెద్ద మొత్తం లో వరద వస్తుండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని భావిస్తున్నారు. వరినాట్లు వేసిన రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. చెరువుల్లోకి నీరు చేరుతుండడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. వర్షాలు తగ్గే వరకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని ఘనపూర్ ఆనకట్ట, పోచారం ప్రాజెక్టు, రాయిన్‌పల్లి ప్రాజెక్టు, హల్దీవాగు ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల్లోకి భారీగా వరద వస్తున్నది. జిల్లాకేంద్రం మెదక్‌తో పాటు రామాయంపేట, నర్సాపూర్, చేగుంట తదితర పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ మెదక్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అధికారులు పనిచేసే చోట కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలన్నారు. మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో స్పందించి ప్రజలకు సేవలు అందించాలన్నారు. లోలెవల్ కల్వర్టులు, నీరు చేరిన రహదారులు దాటకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయి లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, పశువులను మేతకు బయటకు వదల కుండా ఇంటిపట్టునే ఉంచాలని, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వ్యవసాయ పనులకు వెళ్లొద్దని రైతులకు సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్ల్లను గుర్తించి ప్రజలు నివాసం ఉండకుండా తరలించాలన్నారు. గజ ఈతగాళ్లను సిద్ధం గా ఉంచుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో 9391942 254 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూ మ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేశామని, ప్రజలు ఏదేని అత్యవసర సేవలకు ఈ నంబర్‌కు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు.