వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం 6గంటల కరెంటును రెండు, మూడు షిఫ్ట్‌ల్లో ఇచ్చేది. అది ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియకపోయేది. రైతులు అందుకే దొంగ కరెంట్ అని పిలిచేవారు. కరెంట్ సరిగ్గా రాకపోవడంతో పంటలు అంతంతమాత్రంగానే పండేవి. మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం, రైతుల ఆందోళనలు,రైతు ఆత్మహత్యలు నిత్య కృత్యంగా జరిగేవి. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని చెబుతుంటే మళ్లీ పాత రోజులు వస్తాయని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఇప్పుడు మూడు గంటల కరెంటు చాలని అంటున్న కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటు, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ధరణి పోర్టల్ వంటివి బాగున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
మెదక్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయానికి 6 గంటల కరెంటు రెండు, మూడు షిఫ్ట్‌ల రూపంలో ఇచ్చేవారు. దీంతో పంటలు సరిగా పండేవి కావు. రైతు ఆత్మహత్యలు, రాస్తారోకోలు ఉండేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే పరిస్థితి ఉండేది. ఈ అనుభవాలను మేం మరిచిపోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని, రైతులు 10 హెచ్‌పీ మోటర్లు వినియోగించుకోవాలని చెబుతుంటే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూసిన కష్టాలు ఇంకా కండ్ల ముందే కనబడుతున్నాయని, ఇప్పుడు ఆ పరిస్థితి వస్తే రైతుల బతుకు ఆగమే అవుతుందని భయాందోళనలు చెందుతున్నారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించేలా చూస్తామని కరాఖండిగా చెబుతున్నారు. అప్పట్లోనే ఏడు గంటల కరెంటు ఇస్తామని చెప్పి గద్దెనెక్కి రెండు గంటలు కూడా ఇవ్వకుండా రైతులందరినీ ముప్పు తిప్పలు పెట్టారంటూ గ్రామాల్లోని రైతులు, మహిళలు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటు, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ధరణి పోర్టల్ వంటివి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాయి. రైతులకు కూడా మంచి మేలు చేస్తున్నాయి.
కరెంటు 24 గంటలు కావాలని ధర్నా చేశాం..
రైతులకు 24 గంటల కరెంటు ఇస్తేనే పంటలు పండుతాయి. లేకుంటే అన్ని ఎండి పోతాయి. అప్పుడు కరెంటు ఇవ్వక పోవడం వల్లే గొడవలు జరిగినవి. రోడ్ల మీద బండ్లు అడ్డం పెట్టి ధర్నాలు చేశాం. కేసీఆర్ సర్కారు వచ్చినంక మంచిగ రెండు పంటలు పండించుకుంటున్నం. ఎసుంటి రందీలేదు. గప్పట్లో రాస్తారోకోలతో రాని కరెంటు మంచి మనస్సున్న కేసీఆర్ సారు తెచ్చిండు. గందుకే కారుకు ఓటేసుడే.. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని జేసుడే..
– చింతాకుల మాణిక్యం, రైతు, కర్నాల్‌పల్లి, చేగుంట మండలం,
కొత్త పాస్బుక్కులొచ్చినంక నిమ్మలమైంది
నాకు ఎకరంన్నర భూమి ఉంది. పదేండ్ల కింద పాత పాస్బుక్కులుండె. అండ్ల రాసుకుంటా కొట్టేద్దురు. ఎవని భూమి యాడుండునో, ఎంతుండునో ఎవ్వలకు సక్కగ ఎరుకలేకపోతుండె. పాస్ బుక్కుల ఎక్కువుంటె మోక మీద తక్కువుండు, మోక మీద ఎక్కువుంటె బుక్కుల తక్కువుండు. అవసరానికి జాగా అమ్ముదామన్నా, కొందామన్నా పెద్ద బాధ ఉండె. గా ధరణి వొచ్చినంక కొత్త పాస్బుక్కులొచ్చినయి మాకు నిమ్మలమయింది. గిప్పుడు ఎంత ఉంటె అంత జాగా కంప్యూటర్ల బరాబర్ సూపిస్తున్నది. ఎవ్వని మాటలు నమ్మెది లేదు. మా భూములకు పక్కా హక్కులిచ్చిన కేసీఆర్‌కే మా ఓటు.
– ఇలిటం సత్తయ్య, రైతు, నాగులపల్లి, తూప్రాన్
ధరణితోనే రైతులకు భద్రత
ధరణి లేకుంటే భూములపై అధికారులు, దళారులదే పెత్తనం సాగుతది. రైతులు తమ యాజమాన్య హక్కులు కోల్పోతారు. రైతులకు తమ భూమిపై ధరణితోనే భద్రత, భరోసా ఉన్నది. రైతులకు ఉన్న యాజమాన్య హక్కులను తొలిగించేందుకే కాంగ్రెస్ నాయకులు ధరణిని తొలిగిస్గామని ప్రకటిస్తున్నరు. ధరణి రద్దుతో తెలంగాణలో కొత్త భూస్వామ్య వ్యవస్థ ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతులు, కౌలుదారులు మధ్య విభేదాలు వచ్చి భూ తగాదాలు పెరుగుతాయ్. రైతుకు తెలియకుండానే వారి యాజమాన్య హక్కుల్లో మార్పులు, చేర్పులు జరుగుతయ్. ధోరణిలో యాజమాన్య హక్కులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలంటే తప్పనిసరిగా రైతు వచ్చి తన వేలిముద్ర వేస్తేనే హక్కులో మార్పులు జరుగుతాయ్. అందుకే ధరణి ఉండాల్సిందే.
– వంకిడి రామయ్య,రైతు,కాయిదంపల్లి,అల్లాదుర్గం
ఆ రోజులు మళ్లా రావద్దు..
అప్పట్లో ఎన్నో కరెంటు కష్టాలు పడ్డాం. ఆ రోజులు గుర్తుకు వస్తే భయమేస్తున్నది. రాత్రి పూట కరెంటు లేక ఇంట్లో దోమలు, ఈగల బెడదతో బతికేటోళ్లం. జీవితంలో గిట్ల కరెంటు వస్తదని అనుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో కరెంటు చూసి గర్వంగా ఉంది. మా జీవితాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇండ్లకు, వ్యవసాయానికి కరెంటు ఫుల్లుగా అందుతున్నది. ఇది సీఎం కేసీఆర్ సారు దయ. ఆయనకు రుణపడి ఉంటాం.
– లక్ష్మి, మహిళా రైతు, రాయిలాపూర్, రామాయంపేట
3 గంటల కరెంటుతో ఎండుడే..
రైతులకు మూడు, ఐదు గంటల కరెంటు సరిపోదు. రైతులకు 24గంటల కరెంటు ఇస్తేనే పంటలు మంచిగ పండుతాయి. లేకుంటె అన్ని ఎండి పోతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కరెంటు ఇవ్వక పోతే రోడ్ల మీద పడి ధర్నాలు చేశాం. పెద్ద మోటర్లను మేము తెచ్చుకునే పరిస్థితులు లేవు. ధరణితో వేలు పెడితే భూములు పట్టాలు అయినవి. ధరణి లేనప్పుడు వీఆర్వోలు, పట్వారీలను వేడుకోవాల్సి ఉండేది. ఇప్పుడు అలాంటి సమస్యల్లేవు.
– చింతకింది మల్లయ్య రైతు, కర్నాల్‌పల్లి,
కాంగ్రెస్‌వి మోసపూరిత మాటలు
గతంలో ఎవుసం అంటేనే భయంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో మంచిగా పంటలు పండించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ సర్కారు వచ్చినంకా ఎరువులు, విత్తనాలకు ఎం కొరత లేదు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్ల పెట్టి పడ్డ కష్టాలు ఇప్పుడు దూరమైనయ్. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటు. ఎన్నికల టైంలో ఎట్లనో గెలుద్దమని కాంగ్రెసోళ్లు పూటకో మాట మాట్లాడుతుండ్రు. రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే బీఆర్ఎస్ పార్టీకే రైతులు ఓటేస్తారు. మళ్లా కేసీఆర్ సారే సీఎం అయితరు.
– నగేశ్, రైతు, నస్కల్, నిజాంపేట మండలం
రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేసింది
గత ప్రభుత్వాలు రైతులకు తీరని అన్యాయం చేశాయి. గతంలో మేము పడిన కష్టాలు గుర్తు చేసుకోవాలంటే భయమేస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాతే కోలుకున్నం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కరెంటు అందుతున్నది. ఏటా రెండు పంటలు పండించుకుంటున్నం. కాంగ్రెస్ చెబుతున్న 3 గంటల కరెంటుతో పంటలు పండించలేం. 24 గంటలు ఇచ్చే ప్రభుత్వమే కావాలి. బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతులకు అన్యాయమే.
– కె.కోటయ్య, రైతు, భూర్గుపల్లి, పెద్దశంకరంపేట మండలం
పాముల బాధ తప్పింది
బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఉచితంగా ఇస్తున్న కరెంటుతో విష సర్పాల బాధ తప్పింది. గతంలో పొలానికెళ్లి రావాలంటే భయమే. ప్రతి రోజూ బతుకు జీవుడా అంటూ జీవనం సాగించేవాళ్లం. రాత్రిళ్లు పొలాల్లో నిద్రించాలంటే ఎటునుంచి ఏ విషసర్పం, కీటకాలు వచ్చి కాటేస్తాయోనన్న భయం ఉండేది. కానీ నేడు 24 గంటల కరెంటుతో రాత్రి కూడా పగలు లాగా కనబడుతున్నది. ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఉచిత కరెంటుతో ఎంతోమంది అన్నదాతల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తున్నాయి. వేలకు వేలు వచ్చే బిల్లు బాధ తప్పింది. తెలంగాణ వాసినని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.
– లాంబడి కిషన్, రైతు, తిమ్మాయిపల్లి, హవేళీఘనపూర్ మండలం
నెత్తుందా… మూడు గంటలు సరిపోతదా?
24 గంటలు కరెంటు పుష్కలంగా ఉండడంతో పంటలకు కావాల్సినంత నీళ్లు అందుతున్నయి. మోటార్లు కాలడం, రిపేర్లు తగ్గినయి. మూడు గంటల కరెంటుతో పంటలు ఎండిపోవడం ఖాయం. ఈ మాట చెప్పినోడికి నెత్తుందా? ఇప్పుడిప్పుడే అప్పులు తీరి రైతులు కడుపు నిండా అన్నం తింటున్నరు. మళ్లీ పాత పాలన అంటే చీకటి రోజులే. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారే కావాలి.
– పోచయ్య రైతు, గాజిరెడ్డిపల్లి గ్రామం, హవేళీఘనపూర్ మండలం
చేయి తడిపితేనే పట్టాలో పేరు మారేది
గతంలో పహణీ అవసరమై తీసుకుంటే దానిలో అనుభవ కాలం ఉండేది. ఒకరి పేరుపై మరొకరి పట్టా ఉండేది. అధికారుల చేయి తడిపితేనే పట్టా పేరు మారేది. రైతులకు అసలు విషయం తెలిసి గొడవలయ్యేవి. ధరణి వచ్చా క పట్టాకాలం ఒకటి ఉండడంతో ఒకరి భూమిని ఇంకొకరికి మార్చే వీలులేదు. ధరణిపై కొందరికి అవగాహన లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ధరణితో రైతులకు మేలు జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో రికార్డులు భద్రంగా ఉన్నాయి.
– గుల్గరి భూమయ్య, రైతు, భూర్గుపల్లి, పెద్దశంకరంపేట మండలం
చదువుకున్నా ఎవుసం చేస్తున్న..
మాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉద్యోగం చేస్తే భూమి పడావు ఉంటున్నదని ఉద్యోగం చేయకుండా తండాలోనే ఎవుసం చేస్తున్నం. నాకు ఉద్యోగ కంటే ఎవుసమే బాగున్నది. కేసీఆర్ సార్ మంచిగా కరెంట్ ఇస్తుండు. దీనికితోడు రైతుబంధు, రైతుబీమా ఇస్తుండు. సార్ ఇస్తున్న పెట్టుబడి సరిపోతున్నది. అప్పు అయితలేదు. ఇద్దరం ఎవుసం చేస్తున్నం. కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంట్ ఇస్తమంటుండ్రు. దీంతో ఎవుసం నడువదు. మాకు కేసీఆర్ సారే కావాలి. కేసీఆర్‌తోనే మా చదువుకున్న బతుకులు బాగుపడుతున్నయ్.
– నేనావత్ స్వరూప, మహిళా రైతు, గిరిజన తండా, రామాయంపేట
పొలాల్లో పండుకునే రోజులొద్దు
నేను అల్లాదుర్గంలో 30 ఏండ్లుగా పొలం పని చేసుకుంటున్నా. గతంలో బావులు, కాల్వలతో నీళ్లు పారబెట్టినం. ఇప్పుడు బోర్లు వచ్చినయి. అందుకు తగ్గట్లు 24 గంటల కరెంట్ ఉంటున్నది. ఎప్పుడంటే అప్పుడు పొలం పారబెడుతున్నం. 3 గంటల కరెంట్ వస్తే మళ్లీ అదే పొలాల ఒడ్డుల పండే రోజులు వస్తాయి. మళ్లీ అవి మాకు వద్దు. మాకు 24 గంటల కరెంట్ కావాలి. ఇపుడు మా ఇంట్లో, ఊళ్లో కూడా 24 గంటల కరెంట్ ఉంటున్నది. మళ్లీ కారు గుర్తుకే ఓటు వేస్తా. మా తెలంగాణ రైతు బిడ్డని మేము గెలిపించుకుంటం.
– కుమ్మరి రాములు,రైతు, అల్లాదుర్గం
పట్టా మార్చాలంటే చెప్పులు అరగాల్సిందే
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతులకు ఎంతో మేలు చేస్తున్నది. అప్పట్లో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ఆఫీసర్లకు పైసలు ఇచ్చేదాక పనులు అయ్యేవి కావు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక వారం పది దినాల పాటు రిజిస్ట్రేషన్ పేపర్లు పట్టుకుని పట్టా మార్చడానికి తిరగాల్సి వచ్చేది. అధికారులకు పైసలు ముట్టజెప్పిన తర్వాత పాస్‌బుక్ చేతికొచ్చేది. ఇప్పడు అలాంటి తిప్పలు లేవు. స్లాట్ బుక్ తప్ప ఎవరికీ నయా పైసా ఇచ్చేదిలేదు. అదే రోజు ప్రొసీడింగ్ చేతికొస్తున్నది. పోస్ట్‌లో పాస్‌పుస్తకం నేరుగా ఇంటికి వస్తున్నది.
-ఎరుకలి పోచయ్య, రైతు, బ్రాహ్మణపల్లి, నర్సాపూర్
3 గంటల కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తాం
3 గంటల కరెంటిస్తే ఎట్లా బతుకేది. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటిస్తే ఎవుసం సాగుతదా? 24 గంటలుంటేనే ఇష్టమొచ్చినప్పుడు మోటర్ ఏసుకుని పొలంకు నీళ్లు పారబెడుతం. గెలువకముందే రేవంత్‌రెడ్డి 3 గంటలు అంటుండు. గెలిచినంకా ఇంకా ఏముందో గంట ఇస్తడో లేదో కూడా తెల్వది. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌కు సరైన బుద్ధి చెప్తాం.
– కిషన్‌నాయక్, కొత్వాల్‌పల్లి తండా, రేగోడ్
వలస పోయినోళ్లు.. మళ్లొచ్చిండ్రు..
బతుకు దెరువు కోసం దుబాయి, బొంబాయికి పోయినోళ్లు.. మళ్లొచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంటు రావడంతో రైతులు పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీరు రావడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీళ్లు పుష్కలంగా వస్తున్నయి. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో మోటర్లు కాలడంలేదు. గతంలో లోఓల్టేజీతో నెలలో రెండుసార్లు మోటర్లు కాలిపోయి పండించిన పంట రిపేర్లకు సరిపోక రైతులు అరి గోస పడ్డారు. మూడు గంటల కరెంటు ఇస్తే రైతులు మళ్లీ వలసలకు వెళ్లే పరిస్థితి వస్తుంది.
– జోడు రాములు, మెకానిక్, పోతాన్‌పల్లి, చేగుంట మండలం
24 గంటల కరెంటుతో ఇబ్బందులు దూరం
తెలంగాణలో 24 గంటల కరెంటు రావడంతో రైతులు పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రెండు పంటలు పండుతున్నయి. 24గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో మోటర్లు కాలడంలేదు. గతంలో లోఓల్టేజీతో మోటర్లు కాలిపోయి, రైతులు ఇబ్బందులు పడేది. రిపేర్లకు ఎక్కువ ఖర్చు పెట్టేది. మూడు గంటల కరెంటుతో మళ్లీ అటువంటి కష్టాలే రిపీట్ అయితయి.
– వంజరి నర్సింహులు, మెకానిక్, వడియారం, చేగుంట మండలం