సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 5: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో ప్రవేశం పొంది ఏప్రిల్/మేలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మీసేవ, టీఎస్ ఆన్లైన్లో మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రవేశం పొంది పరీక్షలకు హాజరు కాని వారు, పరీక్షలకు హాజరై ఫెయిల్ అయినవారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులని స్పష్టం చేశారు.
పదో తరగతి పరీక్ష ఫీజుకు సంబంధించి ప్రతి థియరీ సబ్జెక్టుకు రూ.100, ప్రాక్టికల్‌కు రూ. 100, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజుకు సంబంధించి ప్రతి థియరీ సబ్జెక్టుకు రూ. 150, ప్రాక్టికల్‌కు రూ.150 చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12 నుంచి 21లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నా రు. రూ.25 చొప్పున అపరాధ రుసుముతో ఈనెల 22 నుంచి 27వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 28 నుంచి మార్చి 4లోగా ఫీజు చెల్లించవచ్చన్నారు. అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు, సిబ్బంది ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ ఎస్.వెంకటస్వామి (80084 03635)ని సంప్రదించాలన్నారు.