మెదక్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవం కార్యక్రమం మెదక్ జిల్లాలో సజావుగా అమలు కావడం లేదు. మెదక్ జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో 3.9 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీఆర్డీవో ద్వారా 18.70 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నారు.దీనికోసం 492 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు.
కాగా, ఈ సీజన్లో ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో 27.84 శాతం మొక్కలు నాటినట్లు అధికారులు రికార్డులు చెబుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడడం వన మహోత్సవం ఉద్దేశం. కాగా, గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
జిల్లా వ్యాప్తంగా నర్సరీల్లో మొక్కలు ఉన్నా, నాటేందుకు చర్యలు తీసుకోవడం లేదు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రతి ఏడాది జూలైలో గుంతలు తీయించాలి. ఆ తర్వాత గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేయాలనే లక్ష్యం ఉన్నా, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వానకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వన మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కేవలం పావుశాతం మొక్కలు నాటడం చూస్తుంటే, అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో తెలుస్తుంది.
రెండేండ్లుగా అటవీశాఖ నర్సరీల్లో మొక్కల పెంపకం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలు, హైదరాబాద్లో అటవీశాఖ నర్సరీలు ఉన్నాయి. అక్కడి నుంచి మొక్కలు తీసుకువచ్చి నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ అటవీశాఖ పరిధిలో 3,9 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్తగా 30 హెక్టర్లలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకం చేయకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది.
మెదక్ జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా మొక్క లు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. అటవీశాఖ ఆధ్వర్యంలో 3.9 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నాం. 30 హెక్టర్లలో మొక్కలు నాటి అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 27. 84 శాతం మొక్కలు నాటాం. డీఆర్డీవో ద్వారా 18.7 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలోని 492 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాం. ఆగస్టు చివరి వరకు మొక్కలు నాటడం పూర్తి చేస్తాం. వర్షాలు పడడంతో గుంతల తవ్వకాలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– జోజి, మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి (మెదక్ జిల్లా)