గజ్వేల్/వర్గల్, ఏప్రిల్ 7: నేరాలు చేసేందుకు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 35 బులెట్లు, ఒక ఒరిజినల్ పిస్టల్, మరో నకిలీ పిస్టల్, నాలుగు పెప్పర్ స్ప్రే బాటిల్స్, రెండు ఐరన్ నకిలీ డస్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. సోమవారం గౌరారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం శ్రీరామనవమి రోజున వర్గల్లో బందోబస్తులో ఉన్న పోలీసులకు మెదక్ జిల్లా రామాయంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఎండీ ఎథిజాజ్, సికింద్రాబాద్‌లోని నేరెడ్మేట్ డిఫెన్స్ కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి ఎండీ హిదాయత్ అలీ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
ఎండీ ఎథిజాజ్ వద్ద ఉన్న బ్యాగులో 30బుల్లెట్స్, రెండు వాడిన బుల్లెట్ కోకాలు, రెండు మొబైల్ ఫోన్లు, అసలు ఆధార్‌కార్డుతోపాటు రెండు నకిలీ ఆధార్ కార్డులు, రెండు డెబిట్ కార్డులు, రెండు మెమోరి, సిమ్‌కార్డులు, రెండు ఐరన్ నకిలీ డస్టర్లు, నాలుగు బాటిల్స్ పెప్పెర్ స్ప్రే, హిదాయత్ దగ్గర ఒక పిస్టల్, ఐదు బుల్టెట్స్, హోండా ఆక్టివా, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరొకరు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గబ్బిలాల్‌పేటకు చెందిన మద్దూర్లాల్(నాని) ఇంటి వద్ద ఉన్నట్లు తెలుపడంతో అతడిని అదుపులోకి తీసుకొని డమ్మీ రివాల్వ, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వీరు ఆర్థిక సమస్యల కారణంగా నేరాలు చేసేందుకు కుట్రపన్నారు. వీరిలో ఎథిజాజ్, హిదాయత్ బీహారు రాష్ట్రంలోని ముంగర్ పట్టణానికి వెళ్లి పిస్టల్. 8 బుల్లెట్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చారు. కొనుగోలు చేసిన పిస్టల్‌ను ట్రయల్ చేసేందుకు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ సికింద్రాబాద్‌లోని హోటల్ సుప్రభాత్లో ఈనెల 2 నుంచి 5వరకు ఉండి సికింద్రాబాద్ చుట్టుపక్కల నేరాలు చేయాలని నిర్ణయించుకొని ప్రయత్నాలు చేశారు. కానీ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎక్కువగా ఉండడంతో అనుకున్న విధంగా నేరాలు చేయడం వీలుకాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు చేయాలనే నిర్ణయంతో ఈనెల 6న శ్రీరామనవమి రోజున వర్గల్ మండల కేంద్రానికి వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి సోమవారం గజ్వేల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.