మెదక్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్థిల్లుతోంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం వందేళ్లు పూరె్తైనా చెకు చెదరలేదు. రంగురంగుల గాజు ముకలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్‌లో కనిపించడం ప్రత్యేకత. ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లండ్‌లో గాజు ముకలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇకడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్య కిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అబ్బురపరుస్తుంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించారు. 1924 డిసెంబర్ 25న పూర్తయ్యింది. పదేళ్ల పాటు సుమారు 12 వేల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలుపంచుకుని ఉపాధి పొందారు. దీనికి అప్పుడు రూ.14 లక్షల వ్యయం అయ్యింది. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్‌కు ‘మెతుకు సీమ’ అనే పేరు వచ్చిందంటారు. చర్చికు పంచద్వారాలున్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండలు రాశారు. ఈ ఐదు కాండాలకు గుర్తుగా ఐదు ద్వారాలు నిర్మించారు. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు, 66 దిమ్మెలు.. 66 గ్రంథాలు చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడి వైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. తొలుత దీన్ని 180 అడుగుల ఎత్తుతో నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు. ఐతే చార్మినార్ ఎత్తు కంటే ఎకువ ఉండకూడదని పాలకులు ఆదేశించడంతో 5 అడుగుల ఎత్తు తగ్గించి నిర్మించారు. అప్పట్లో చర్చి నిర్మాణానికి రూ.14 లక్షలు ఖర్చు చేశారు. చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు.
చర్చిలో మొత్తం మూడు గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిజ్బరీ రూపొందించాడు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితే అపురూప దృశ్యాలు కనపడతాయి. తూర్పు కిటికీ ఏసు జన్మ వృత్తాంతం, పుట్టుకను తెలియజేసేలా 1947లో అమర్చారు. కింది భాగంలో ఏసు తల్లి మరియ, తండ్రి యేసేపు, తొట్టెలో బాల యేసు, ఎడమ వైపు గొల్లలు, మధ్యలో గాబ్రియల్, లోక రక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు.