సిద్దిపేట, జనవరి 19: ఆయిల్‌పామ్ రైతులకు డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఈజీఎస్ పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఈజీఎస్‌లో మంజూరైన సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక భవనాల పను లు ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్ రైతులకు వచ్చే డబ్బులు పెండింగ్ పెట్టవద్దని, ఎప్పటికప్పుడు చెల్లించాలని సూచించారు. ఈజీఎస్ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. క్యాటెల్ షెడ్స్, పౌల్ట్రీ ఫామ్స్, బోర్‌వెల్స్, ఇంకుడు గుంతలు పనులు కొనసాగించాలన్నారు. నర్సరీల నిర్వహణ, పల్లె ప్రకృతి నిర్వహణ లోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మీయ భరోసాకు అర్హులైన కూలీలను గుర్తించాలని, అర్హులకు నష్టం చేకూరవద్దని సూచించారు.
ఎస్సెస్సీ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలపాలి
సిద్దిపేట జిల్లా ఐదేండ్లుగా పదోతరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిందని, అదే పంథా తో ముందుకు పోవాలని హరీశ్‌రావు సూచించారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా స్థానాన్ని కాపాడాలని, దానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. ఎస్సెస్సీ విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగుతుల్లో అల్పాహారం ఏర్పాటు చేస్తానని, వారం రోజుల్లో తానే స్వయంగా ఏదైనా సూల్లో ప్రారంభిస్తానని చెప్పారు. అందుకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గతేడాది తాను సిద్దిపేట నియోజకవర్గం వరకే స్నాక్స్ ఏర్పాటు చేశానని, ఈసారి జిల్లా అంతటా విద్యార్థులకు స్నాక్స్ అందిస్తానని హరీశ్‌రావు తెలిపారు.
వెయ్యి పడకల దవాఖాన అందుబాటులోకి తేవాలి
సిద్దిపేట ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సిద్దిపేటలో వెయ్యి పడకల దవాఖానను నిర్మించామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనులు ఎకడికక్కడ ఆగిపోయాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ పనులపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రూ. 170 కోట్లు పనులు పూర్తికాగా, ఇంకా రూ.40 కోట్ల పనులు మిగిలిపోయాయని, వెంటనే పనులు పూర్తిచేసి ప్రజలకు వినియోగంలోకి తేవాలని కోరారు. రూ.40 కోట్లతో సిద్దిపేటలో నర్సింగ్ కళాశాలను మంజూరు చేసుకున్నామని, వేగం గా పనులు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తేవాలన్నారు. మెడికల్ కళాశాల పీజీ హాస్టల్ పనులు పూర్తిచేయాలన్నారు. ఆయుష్ దవాఖానకు ప్రహరీ పనులు చేపట్టాలన్నారు. సిద్దిపేటలో గత ప్రభుత్వంలో టూటౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాలు మంజూరు చేసుకున్నామని, వెంటనే పనులు చేపట్టాలని, త్రీ టౌన్ నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని అధికారులకు హరీశ్‌రావు ఆదేశించారు.