గుమ్మడిదల, జూన్ 28: పేద రైతుల జీవనోపాధి కో సం కేటాయించిన అసైన్డ్ భూములు వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారడంతో రెవెన్యూ యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామ శివారులో సర్వేనంబర్ 313 లోని భూములపై నిర్వహించిన విచారణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అసైన్డ్ భూముల్లో కమర్షియల్ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, విచారణ చేపట్టారు.
వ్యవసాయ అవసరాల కోసం కేటాయించిన భూములను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడ మే కాకుండా ఇటుక బట్టీల కారణంగా భూముల స్వరూపం మారినట్లు గుర్తించా రు. గతంలో సంబంధిత రైతులకు నోటీసు లు జారీ చేసినప్పటికీ, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో రెవెన్యూ శాఖ కఠిన నిర్ణ యం తీసుకుంది. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో సుమారు 30 మంది రైతులకు చెందిన 13 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభు త్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ చర్యతో అసైన్డ్ భూముల దుర్వినియోగంపై ప్రభు త్వం సీరియస్గా వ్యవహరిస్తోందనే సంకేతాలు వెలువడ్డాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అసలు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు..
హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న గుమ్మడిదల మండలంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇక్కడ భూములు బంగారంగా మారాయి. గుమ్మిడిదల మండలం అన్నారంలోని 313 సర్వే నంబర్లోని అసైన్డ్ భూముల్లో 30 మందికి పైగా పేద కుటుంబాలు కొన్నేండ్లుగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. వీరికి ప్రభుత్వం పట్టాలు అందజేసింది. కొన్నేండ్లుగా ఆ రైతులు వ్యవసాయం చేస్తున్నప్పటికీ, కాలానుగుణంగా ఆ గ్రామానికి చెందిన కొందరు కమర్షియల్గా ఆలోచించారు. భవన నిర్మాణ రంగానికి వినియోగించే ఇటుక బట్టీలు ఆ భూముల్లో నిర్వహించాలని ఆలోచించారు.
అన్నదే తడవుగా ఇటుక బట్టీలను ఉన్న భూముల్లో నిర్వహించడం ప్రారంభించారు. కాలక్రమేణా వ్యా పారం వృద్ధి చెందడంతో పక్కన ఉన్న వ్యవసాయ భూముల రైతులకు ఏడాదికి కౌలు పైసలు ఇస్తామని, ఆ భూముల్లో బట్టీల నిర్వహణ సాగించారు. 313 సర్వే నంబర్లో ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన రైతులు కూడా ఆశపడి ఆ భూములను కొన్నేండ్లుగా బట్టీల నిర్వహణకు కౌలుకు ఇచ్చారు. ఇది పూర్తిగా అసైన్డ్భూములకు చట్టవిరుద్ధం. అయినప్పటికీ ఎవరు ఎలాం టి ఫిర్యాదులు చేయకపోవడంతో ఇన్నాళ్లు సాఫీగా కొనసాగింది.
కానీ, ఇటీవల 313 సర్వే నంబర్లో ఓ రైతు తమ భూమిని ఇటుకబట్టీల నిర్వహణకు తీసుకుని కౌలు ఇస్తలేడని పంచాయితీ అ య్యింది. ఈ పంచాయితీ కాస్త రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లింది. తీరా చూసేసరికిగా అ భూములు అసైన్డ్ భూములగా గుర్తించి కమర్షియల్కు వినియోగించవద్దని రెవెన్యూ అధికారులు సదరు రైతులకు నోటీసులు ఇచ్చారు. అయిననా ఆగకపోవడంతో రెవెన్యూ యంత్రాంగం ఆ భూములను చట్టపరంగా స్వాధీనం చేసుకున్నట్లు గుమ్మిడిదల తహసీల్దార్ పరమేశం తెలిపారు. వ్యవసాయం చేసుకుంటున్న వారిని మినహా కమర్షియల్కు వినియోగించిన వారి భూములనే స్వాధీనం చేసున్నట్లు తెలిపా రు. క్షేత్రస్థాయిలో అసైన్డ్ భూమిని గుర్తించి హద్దులు కేటాయించనున్నట్లు తెలిపారు.