సిద్దిపేట, జనవరి 26: నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశానుసారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రొసీడింగ్‌లు అందించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఐదు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి అదించారు. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో భూములు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందించారంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో చదవకుండా ఎలా ప్రొసీడింగ్స్ ఇస్తారని మహిళలు, యువకులు నిలదీశారు. తాను 30ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తే, తన పేరు లేకుండానే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌కు చెందిన మాజీ సర్పంచ్ ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు కల్పించినప్పటికీ గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీశారు. ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేశారో చెప్పాలంటూ మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లిలో జరిగిన గ్రామసభలో అధికారుల తీరు వివాదాస్పదమైంది.
అధికారులకు అందించిన ప్రొసీడింగ్స్‌పై ఎలాంటి సంతకాలు లేకపోవడంతో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ముగ్గురికి మాత్రమే ప్రొసీడింగ్స్ అందజేసి కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయారు. నారాయణరావుపేట మండలం మాఠిలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని రైతులు, మహిళలు నిలదీశారు. చిన్నకోడూరు మండలం మెట్పల్లిలో కొంతమందికి పథకాలు మంజూరు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ పథకాలు అందించాలని గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
తొగుట, జనవరి 26: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఆదివారం ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ రసాభాసగా మారింది. తుక్కాపూర్‌లో నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి కొందరికే ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడంపై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. దీంతో కార్యక్రమం రసాభాసగా మారింది. అనర్హులను పథకాలకు ఎంపిక చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు పథకాలు అందించాలన్నారు.
కొమురవెల్లి, జనవరి 26: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాన్పల్లిలో ఆదివారం లబ్ధ్దిదారులకు తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవాని పథకాల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పత్రాల అందజేత సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు గ్రామస్తులు అనర్హులకు ప్రొసీడింగ్స్ పత్రాలు ఇచ్చారని, తమకు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. దీంతో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ, ఎంపీడీవో శ్రీనివాసవర్మ, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, మండల వ్యవసాయాధికారి వెంకట్రావమ్మ పాల్గొన్నారు.