గజ్వేల్ అర్బన్, ఆగస్టు 14: సమైక్య రాష్ట్రంలో కులవృత్తులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులవృత్తులపై ఆధారపడిన వారు ఆగమవుతున్నారని గుర్తించింది. సీఎం కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే కులవృత్తులకు జీవం పోసేవిధంగా చర్యలు చేపట్టింది. యాదవులకు, గొర్రెల పంపిణీతోపాటు, ముదిరాజ్‌ల ఉపాధి కోసం అన్ని చెరువుల్లో సబ్సిడీపై చేప పిల్లలను అందించింది. గజ్వేల్ నియోజకవర్గంలోని యాదవుల కోసం సబ్సిడీ గొర్రెల పంపిణీని చేపట్టింది. గజ్వేల్ నియోజకవర్గంలోని అప్పటి గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, కొండపాక, మర్కూక్ మండలాల్లో మొత్తం 7,678 యూనిట్ల పంపిణీకి లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. మొదటి ఫేస్‌లో 3,765 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయగా ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, 1 విత్తన పొట్టేలును యాదవులకు పంపిణీ చేశారు. మొదటి ఫేస్‌లో పంపిణీ చేసిన గొర్రెలను పెంచిన కాపరులు నాలుగింతల లాభాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. యాదవులు గొర్రెలు, మేకలనే తమ ముఖ్య ఆర్థిక సంపదగా భావిస్తుంటారు.
సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రకృతి అనుకూలించి సమయానికి వర్షాలు కురిసి పాడిపంటలు పెరగడమే కాకుండా పశుగ్రాస వనరులు కూడా బాగా వృద్ధి చెందాయి. ఫలితంగా గొర్రెలకాపరులకు పరిస్థితులు అనుకూలంగా మారినా కొత్త గొర్రెలను కొనుగోలు చేయడానికి ఆర్థికంగా వెనుకబడడంతో సీఎం కేసీఆర్ విషయాన్ని గుర్తించారు. మార్కెట్లో గొర్రె మాంసానికి ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా స్థానిక గొర్రెలకాపరుల వద్ద గొర్రెలు లేకపోగా మాంసం కోసం ఇతర రాష్ర్టాలపై ఆధారపడాల్సి వచ్చేది. అందుకే సీఎం కేసీఆర్ యాదవులకు 21 చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలో ప్రారంభించారు.
ఆ తర్వాత నాలుగురెట్లు యాదవులు ఆర్థికాభివృద్ధి సాధించారు. కాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండోవిడుత సబ్సిడీ గొర్రెల పంపిణీకి అధికారులు ముందుకు సాగుతున్నారు. రెండో విడుతలో గజ్వేల్ మండలంలో 901మంది లబ్ధిదారులను గుర్తించగా 177మంది డీడీలు చెల్లించారు. అలాగే వర్గల్ మండలంలో 698యూనిట్లకు 183 యూనిట్లు, ములుగులో 643కు 163, మర్కూక్‌లో 269 యూనిట్లకు 163, జగదేవ్‌పూర్‌లో 644 యూనిట్లకు 295, కొండపాకలో 758యూనిట్లకు 347 యూనిట్లకు ఎంపికైన లబ్ధిదారులు డీడీలు చెల్లించారు. వీటిలో మొత్తం 119 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామన్నారు. 119యూనిట్లకు 2,499 గొర్రెలకు ప్రభుత్వం రెండో విడుతల పంపిణీ చేసింది. త్వరలో అందరికీ యూనిట్లను అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.