సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 4: సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విధులు నిర్వహించే సెక్టార్ అధికారులకు జరిగిన ఒకరోజు శిక్షణలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమైనదని, మీకు జారీ చేసిన పోలీంగ్ స్టేషన్లకు రూట్‌మ్యాప్‌ను తయారు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్లలో అన్ని సదుపాయాలు కల్పించాలని, హోం ఓటింగ్ ప్రక్రియ చేపట్టేటప్పుడు ఆయా తహసీల్దార్లు, బీఎల్వోల సాయం తీసుకోవాలన్నారు. ఈవీఎం యం త్రాల డిస్ట్రిబ్యూషన్ నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసి కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపర్చే వరకు మీదే బాధ్యత అన్నారు. సెక్టార్ అధికారులు ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ అనుసంధానం నుంచి పూర్తి మూసివేసే వరకు ప్రతి విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
గజ్వేల్, ఏప్రిల్ 4: అభ్యర్థులు పోటీ పరీక్షల్లో ధృడసంకల్పంతో చదివితేనే అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం గజ్వేల్‌లో షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్స్, తదితర పోటీ పరీక్షల మూడు నెలల ఉచిత శిక్షణ శిబిరాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి కవితతో కలిసి కలెక్టర్ మనుచౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిలబస్, ఎంపిక చేసుకునే పుస్తకాలను ముందుగానే నిర్ణయించుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. మార్కెట్లో దొరికే పుస్తకాలతో పాటు ఎంచుకున్న వాటిలో నుంచి ప్రతి అంశాన్ని చదవాలన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు సోషల్ మీడియాకు దూరం గా ఉండాలన్నారు. శిక్షణలో చెప్పే అంశాలను వదిలిపెట్టకుండా చదవాలన్నారు. ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని చదవాలన్నారు. శిక్షణ తీసుకునే అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ శ్రీకాంత్ కలెక్టర్‌కు శిక్షణా కేంద్రం గురించి వివరించారు.