నర్సాపూర్,మే11: మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆదివారం క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నర్సింహులు ఇంటి వాకిట్లో కొందరు దుండగులు క్షుద్రపూజలు చేశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆదివారం ఉదయం నిద్ర లేచి చూడగానే ఇంటి బయట వాకిట్లో మనిషిని పోలిన బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమలను గుర్తుతెలియని దుండగులు ఒకచోట పెట్టి వెళ్లారు.
పిండితో మనిషిని పోలిన బొమ్మను తయారు చేసి దానికి మేకులు గుచ్చి, అలాగే పిండితో బొక్కలను పోలిన రూపాన్ని తయారు చేసి వాకిట్లో పెట్టి భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. కుటుంబ సభ్యులు వీటిని చూడగానే భయభ్రాంతులకు, ఆందోళనకు గురయ్యారు. కొందరు వారికి పడనివారే భయభ్రాంతులకు గురి చేయాలని ఇలా చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.