జహీరాబాద్, అక్టోబర్ 5 : ఆరుగ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో హరీశ్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు.
న్యాల్కల్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు పాండురంగారావుపాటిల్, బస్వరాజ్‌పాటిల్, మల్లప్ప, వీర్శెట్టి, రాజు, జరప్పలతో పాటు మరో 35 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలను వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని జడ్పీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మెజార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుని గూలాబీ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ పట్ల చోటాభాయ్.. బడే భాయ్‌లు ఇద్దరిది ఒకేతీరని విమర్శించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరో పార్టీది ద్రోహ చరిత్ర ఆని ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు తెలంగాణ పాలిట శకునిలేనని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన చేస్తే, రేవంత్‌రెడ్డి అనురిస్తున్న చెత్త విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ర్టాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టాడని విమర్శించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
కేసీఆర్ పాలనలో రైతుల కోసం ఎంతో కృషి అన్ని విధాలుగా అదుకుందన్నారు. రైతులు పంటల సాగుకు అవసరం అయ్యే యూరియాను అందుబాటులో ఉండేలా కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. కనీసం రైతులకు యూరియాను కూడా సరఫరా చేయాలేని దౌర్భాగ్య స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని హరీశ్‌రావు విమర్శించారు.రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారనే కృతజ్ఞత కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే, తెలంగాణాకు ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయకపోవం చూస్తుంటే తెలంగాణపై ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతుందన్నారు. 2017 సంవత్సరం నుంచి కొత్తగా జీఎస్టీ తెచ్చి పప్పు, ఉప్పు, సబ్బు, నూనె, బట్టలు, టీవీలు, సైకిల్, మోటర్, కారు.. ఇలా అన్ని రకాల వస్తువుల ధరలను పెంచి ప్రజలను పీడించి దోచుకుని, ఇప్పుడు తగ్గించామని బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికల ముగిసిన వెంటనే రూపాయి పెంచుతూ పకడ్బందీగా ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, మండల పార్టీ నాయకులు రాజేందర్‌రెడ్డి, అప్పారావుపాటిల్, దేవిదాస్, యూనూస్ తదితరులు పాల్గొన్నారు.