సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని విజయ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘంలో అవినీతి రాజ్యమేలుతున్నదని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. పాల కేంద్రానికి తెచ్చిన పాలకు సరైన ధర, సంఘం నుంచి బోనస్ రాక ఇబ్బందులు పడుతున్నామని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నుంచి పాల సంఘం నడుస్తున్నప్పటికీ 2002 నుంచి సహకార సంఘంగా రూపుద్దిదుకుంది.
ఈ సంఘం ఇటు విజయ డెయిరీకి, అటు కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉండకుండా స్వతంత్ర ప్రతిపత్తితో నడిపించుకుంటున్నది. దీంతో పాలకవర్గంతో పాటు ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. రైతులు తెచ్చే పాలకు మద్దతు ధర చెల్లించకుండా, విడిగా పాలను అమ్ముతూ సరైన లెక్కలు చూపించకుండా అవినీతికి పాల్పడుతూ రైతులకు మద్దతు ధర, బోనస్ రాకుండా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సంఘం నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్ లెక్కల్లోనూ అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
హుస్నాబాద్, జూన్ 7: హుస్నాబాద్ విజయ పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘంలో ఒకప్పుడు 500మందికి పైగా పాడి రైతులు పాలు పోసేవారు. సంఘం నిర్వహణలో లోపం వల్లనో, పాడి రైతులకు సరైన ప్రోత్సాహం లేకనో కాని ఆ సంఖ్య ప్రస్తుతం 200 లోపలికి పడిపోయింది. ఇక్కడ ప్రస్తుతం రోజుకు సగటున 820లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఇందులో 400 లీటర్ల గేదెపాలు, 420లీటర్ల ఆవుపాలు వస్తాయి. ఫ్యాట్ 15శాతం వస్తే లీటరుకు రూ.120 ధర చెల్లిస్తున్నారు.
ఎంత నాణ్యతతో పాలు తెచ్చినా లీటరుకు రూ.45 దాటడం లేదని, ఆవుపాలు పోసే రైతులు చెబుతుండగా, రూ.55 దాటడం లేదని గేదెపాలు పోసే రైతులు చెబుతున్నారు. సంఘం వద్ద విడిగా అమ్మే పాలు లీటరుకు రూ.80కి అమ్ముతున్నారు. విడిగా అమ్మే గేదెపాలలో ఆవుపాలు, నీళ్లు కలిపి విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ డెయిరీకి పాలు పోస్తూ, ప్రియా డెయిరీ పాల ఉత్పత్తులను విక్రయించడం విశేషం. సంఘంలో ఏడాదికి రూ.లక్షల్లో అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు డైరెక్టర్లకు ఆవులు, గేదెలు లేకున్నా, పాలు పోయకున్నా కొన్నేండ్లుగా బినామీ పేర్లతో పాలు పోయిస్తూ డైరెక్టర్లుగా కొనసాగుతుండడం విశేషం.
హుస్నాబాద్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే సంఘం నడుస్తున్నది. సంఘం పాలకవర్గాన్ని ఎన్నుకోవాలన్నా…కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా… డబ్బులు డ్రా చేయాలన్నా…రైతులకు బోనస్ చెల్లించాలన్నా, ఆదాయ వ్యయాల లెక్కలు చూడాలన్నా… అంతా ఆయనే చూసుకుంటాడని, పాలకవర్గానికి, రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో రూ.30లక్షల వరకు డబ్బులు ఉన్నాయని, రుణాల కోసం మరో రూ.20లక్షలు ఉన్నా.. బోనస్, రుణాలు ఇవ్వకుండా కార్యదర్శి నిర్లక్ష్యం చేస్తున్నాడని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై ప్రశ్నించిన డైరెక్టర్లు, రైతులను ఏదో విధంగా మచ్చిగ చేసుకొని సంఘాన్ని ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
హుస్నాబాద్‌లోని విజయ పాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే వాటర్‌ప్లాంట్‌కు సంబంధించిన లెక్కలు సైతం చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏటా 2500 చొప్పున కొత్త క్యాన్లు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. వీటి కొనుగోళ్లలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి లోడుకు రూ.15వేలనుంచి రూ.20వేల అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్లాంట్‌లో రోజుకు 150నుంచి 200ల క్యాన్ల వాటర్ అమ్ముతారు. ఒక్కో క్యాన్ నీటికి రూ.5 ధర తీసుకుంటారు. ఎన్నిక క్యాన్లు అమ్ముతారు, ఎన్ని డబ్బులు వస్తున్నాయనే విషయం సంఘం సభ్యులకు చెప్పకపోవడం గమనార్హం.
నేను 30ఏండ్ల నుంచి పాలు పోస్తున్న. చాలాసార్లు నాకు ఉత్తమ పాడి రైతు అవార్డు వచ్చింది. ఇటీవల సంఘంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్లు దోచుకుంటున్నరు. సంఘం లెక్కలు చెప్పేందుకు ఏడాదికోసారి ఏర్పాటు చేసే సమావేశం ఎలాంటి లెక్కలు చెప్పకుండానే ముగిస్తున్నారు. గట్టిగా మాట్లాడే వారికే సంఘం నుంచి లాభం జరుగుతుంది తప్ప నాలాంటి నిజమైన రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల కష్టంతో నడిచే పాల సంఘంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలి.
– భాస్కర్‌రెడ్డి, పాడి రైతు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
సంఘాన్ని నిబంధనల ప్రకారమే నడుపుతున్నాం. కాకపోతే ఏ డెయిరీతోనూ అనుంబంధంగా లేము. విజయ డెయిరీతో అనుబంధంగా ఉండేందుకు ఇటీవల లేఖ రాసాం. కరీంనగర్ డెయిరీ పాలకవర్గానికి పోటీచేసే అర్హత మా సంఘానికి లేదు. కానీ, వాళ్లు వచ్చి లెక్కలు చూసుకొని పోతారు. ఏ బ్యాంకు నుంచి డబ్బులు డ్రాచేయలేదు. రైతులకు ఆవులు, గేదెల కొనుగోలుకు అప్పులు ఇస్తు న్నం. పాల సంఘం, వాటర్‌ప్లాంట్‌ను సక్రమంగానే నడిపిస్తున్నాం.
– జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి, హుస్నాబాద్ విజయ పాల సంఘం(సిద్దిపేట జిల్లా)