ఊరిపై ఉన్న మమకారంతో ఓ ఎన్నారై ఏదో ఒక సాయం చేయాలని భావించాడు. వార్డు వాసులకు మినరల్ వాటర్ అందించాలని వాటర్ ప్లాంట్ ప్రారంభించాడు. జీతాగాళ్లను పెట్టి ఇంటింటికీ ఫ్రీగా నీళ్లు అందిస్తున్నాడు. ఆయనే హుస్నాబాద్ పట్టణంలోని 19వ వార్డుకు చెందిన తగరపు నరేశ్.
హుస్నాబాద్ టౌన్, డిసెంబరు 11: హుస్నాబాద్ పట్టణంలోని 19వ వార్డులోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన తగరపు రాజయ్య-శాంతవ్వ దంపతుల కొడుకు నరేశ్. ప్రస్తుతం దుబాయిలోని బ్యాంక్‌లో ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తాను పుట్టి, పెరిగిన ప్రాంతానికి ఏదో సాయం చేయాలని భావించాడు. తన వార్డులో పేదలు ఎక్కువగా ఉండడంతో వారి ఆరోగ్యానికి అవసరమైన మంచినీరు అందరికి అందడం లేదని తెలుసుకున్నాడు. పేదలందరికీ మినరల్ వాటర్‌ను అందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను స్థానిక మాదిగ భవనంలో రూ.10లక్షలతో బోర్, ప్రత్యేకంగా వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశాడు.
ఇందులో రెండువేల లీటర్ల కెపాసిటీ ట్యాంకులను ఏర్పాటు చేసి, ఉచితంగా అందరికి మినరల్ వాటర్‌ను అందిస్తున్నాడు. వార్డుపరిధిలోని ప్రజలు వాటర్‌ప్లాంట్ వద్దకు వచ్చి మంచినీరు తీసుకుపోవాల్సిన పనిలేకుండా ఇంటివద్దకే మినరల్ వాటర్‌ను అందించే సౌకర్యం సైతం కల్పించాడు. ప్లాంట్‌తోపాటు ఇంటింటికి మినరల్ వాటర్‌ను అందించేందుకుగాను ముగ్గురు యువకులను సైతం నియమించాడు. ఇంటింటికి మినరల్ వాటర్‌ను క్యాన్లద్వారా అందించేందుకునుగాను ప్రత్యేకంగా ఎక్స్ఎల్ వాహనాన్ని పెట్టాడు. మినరల్ వాటర్ కావాల్సిన వారు ఫోన్‌ద్వారా సమాచారం అందిస్తే చాలు వారికి మంచినీటిని చేరవేస్తున్నారు.
సంపాదించిన దాంట్లో కొంత సాయం
నేను సంపాదిస్తున్న దాంట్లో కొంత మందికి సాయం అందించాలనే ఆలోచనతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. చేసే పని పదిమందికి ఉపయోగపడాలనే భావనతో వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశా. పేదలు ఆరోగ్యంగా ఉండాలని వారికి మినరల్ వాటర్‌ను అందిస్తున్నా. నాలాగా ప్రతి ఒక్కరూ పదిమందికి సాయం చేసేందుకు ముందుకు
రావాల్సిన అవసరం ఉంది.
– తగరపు నరేశ్ ఎన్ఆర్ఐ
పేదలకు సేవ చేస్తున్నాడు..
కరోనా సమయంలో ఇక్కడకు వచ్చిన సమయంలో ఏదో ఒక పని చేయాలనే ఆలోచన చేసిండు ఎన్ఆర్ఐ నరేశ్. పదిమందికి ఉపయోగపడే పని చేయాలనే తపనతోనే వాటర్‌ప్లాంట్ పెట్టి, ఉచితంగా అందరికి మంచినీరు ఇంటికే అందిస్తున్నడు. సేవచేయాలనే ఉద్దేశంతో భీమ్ హ్యాండ్స్ సొసైటీని ఏర్పాటు చేసి ప్రజలకు పలు రకాల సేవలందించేందుకు నరేశ్ కృషి చేస్తున్నడు. – బత్తుల చంద్రమౌళి, హుస్నాబాద్ భీమ్ హ్యాండ్స్ సొసైటీ వర్కింగ్ ప్రెసిడెంట్, హుస్నాబాద్

వాటర్‌ప్లాంట్‌కు వెళ్లడం తప్పింది..
మినరల్ వాటర్ కోసం రోజూ వాటర్‌ప్లాంట్‌కు పోయేది. మా వార్డులోనే నరేశ్ వాటర్ పెట్టడంతో ఇప్పుడా బాధ తప్పింది. అందరికి అతను ఫ్రీగా నీళ్లు ఇస్తున్నాడు. నెలకు రూ.250 వరకు మినరల్ వాటర్ క్యాన్ల కోసం పెట్టేది. పేదలకోసం తమ్ముడు చేస్తున్న మంచి పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. పదిమందికి సాయం చేసే గొప్ప మనసు నరేశ్‌కు ఉంది.
– కందుకూరి శారద, హుస్నాబాద్
మాలాంటి సేతగానోల్లకు ఇంటికాడికే..
పెద్దలు ఉంటరు.. సిన్నలు ఉంటరు.. సాతగానోల్లు కూడ ఉంటరు.. వాళ్ల కోసం నరేశ్ ఇండ్లల్లకే నీళ్లు పంపుతాండు. అందరికి మంచిచేయ్యాలనే పిల్లగాడు మంచినీళ్లు రోజు తెచ్చి ఇత్తాండు. సాతగానోల్లను కాపాడాలనే తపనతో నీళ్లను ఇంటికే పంపిత్తాండు.
– మట్టెల నర్సవ్వ, హుస్నాబాద్