సంగారెడ్డి,ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): జహీరాబాద్ పార్లమెంట్లో ఎన్నికల వేడి రాజుకుంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన రాజకీయపార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు నామినేషన్లపై దృష్టిపెట్టాయి. ఎన్నికల ప్రచార జోరును పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు జహీరాబాద్ పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల ముఖ్యనేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం రంగంలోకి దిగనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బహిరంగసభలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. జహీరాబాద్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువత, రైతు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 26న నామినేషన్లను పరిశీలిస్తారు. 29న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 13న పోలింగ్ జరుగుతుం ది. జహీరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించి సంగారెడ్డి కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు.నామినేషన్ల దాఖలుపై ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. తొలిరోజు కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ శెట్కార్ తరఫున తొలిసెట్ నామినేషన్‌ను ఆ పార్టీ నాయకులు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్‌కుమార్ ఈనెల 20న పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నామినేషన్ వేయనున్నారు. ఆతర్వాత 24న మరోమారు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ శెట్కార్ 24న మరోమారు నామినేషన్ వేయనున్నారు. సురేశ్‌శెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పెద్దలు హాజరయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఈనెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్లో హ్యాట్రిక్ గెలుపుపై బీఆర్ఎస్ దృష్టిపెట్టింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి జహీరాబాద్ పార్లమెంట్లో వరుసగా రెండుమార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనిల్‌కుమార్ గెలుపుకోసం బీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా ప్రచారం చేస్తూ క్యాడర్‌ను ముం దుకు నడిపిస్తున్నారు. అనిల్‌కుమార్ జహీరాబాద్ పార్లమెంట్ పరిదిలోని ఏడు నియోజకవర్గాల్లో త్వరలో ఇంటింటి ప్రచారం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సుల్తాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన సభ విజయవంతమైంది. సభ విజయవం తంతో బీఆర్ఎస్ క్యాడర్ ఫుల్ జోష్‌లో ఉంది.