మెదక్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. తొలి రోజు ఒక నామినేషన్ కూడా దాఖలుకాలేదు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ 10వ తేదీ వరకు కొనసాగనుండగా.. 13న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15న ఉపసంహరణ గడువు ముగియనుండగా.. తుది జాబితా ప్రకటన చేస్తారు. 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుంది. మెదక్ నియోజకవర్గ ఆర్వో కేంద్రాన్ని జిల్లా కేంద్రం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ ఆర్వో కేంద్రాన్ని నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అభ్యర్థులు సంబంధిత అధికారులతో తగిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చని మెదక్ రిటర్నింగ్ అధికారి అంబాదాస్ రాజేశ్వర్ తెలిపారు.
నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థి వెంట వెళ్లేందుకు మరో నలుగురికి మాత్రమే అవకాశం ఉంది. అభ్యర్థులను ప్రతిపాదించడానికి అదే నియోజకవర్గానికి చెందిన ఎవరైనా ఒకరు ఉంటే చాలు. ఇండిపెండెంట్ అభ్యర్లుల విషయంలో నిబంధనలు మారుతాయి. నామినేషన్ వేస్తే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.5వేలు, సాధారణ అభ్యర్థులకు రూ.10 వేలుగా నిర్ధారించారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ వేయవచ్చని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. నామినేషన్ వేసిన తర్వాత పత్రాలను సంబంధిత ఎన్నికల అధికారికి గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.
నర్సాపూర్, నవంబర్ 3: నామినేషన్లు ప్రారంభమైన మొదటి రోజు పార్టీల అభ్యర్థులు ఆసక్తి చూపలేకపోవడంతో నర్సాపూర్‌లోని ఆర్వో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్లు ఏమీ నమోదవలేదు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు జరుగకుండా తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ షేక్‌లాల్ మధార్, ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు వెల్లడించారు.