శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానున్నది. ఇందుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈనెల 10 చివరి తేది. స్కూృటినీ 13న, నామినేషన్ల ఉప సంహరణ 15, పోలింగ్ ఈనెల 30న జరగనున్నది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలోనే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆర్వో కార్యాలయాల వద్ద వంద మీటర్ల దూరంలో బారికేడ్లు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొత్తం 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మెదక్‌లో 274, నర్సాపూర్‌లో 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 4,37,015 మంది ఉన్నారు.
సిద్దిపేట, నవంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం (నేటి) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి గడువు నవంబర్ 10వ తేదీ. నామినేషన్ల స్కూృటిని నవంబర్ 13, నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15, నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలోనే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద వంద మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.ఆయా కేంద్రాల్లో సహాయక కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాల పూరింపులో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తారు.ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కనున్నది. ఆయా పార్టీల నాయకులు ప్రచారంలో మరింతగా దూకుడు పెంచనున్నారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలతో పాటు జనగామ నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వారి ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది.