సిద్దిపేట, మార్చి 25: పెట్రోల్, డీజిల్ దొరకట్లేదని ప్రచారంతో సిద్దిపేట జిల్లావ్యాప్తంగా బుధవారం రెండోరోజూ వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. ఒకసారిగా డిమాండ్ ఏర్పడడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. సిద్దిపేట జిల్లాలో 169 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో భారత్ పెట్రోలియం బంకులు 40, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చెందిన బంకులు 59, ఎల్వోసీఎల్ బంకులు 70 ఉన్నా. వీటిలో దాదాపు 70% వరకు బంకులు మూతపడ్డాయి.
జిల్లాలో ప్రతిరోజు 174, వేల లీటర్ల పెట్రోల్, 3.48 లక్షల లీటర్ల డీజిల్ సేల్ అవుతుంది. కానీ, వదంతులు నేపథ్యంలో జిల్లా లో రెండు రోజుల్లోనే 70% వరకు అమ్మకాలు పెరగడంతో చాలా బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. సివిల్ సప్లయ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయినప్పటికీ పెట్రోల్ బంకుల్లో కొరత ఏర్పడుతుంది. చాలామంది క్యాన్‌ల్లో డీజిల్, పెట్రోల్ తీసువెళ్లి బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై అధికారులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.
గతంలో పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేసే పెట్రోలియం కంపెనీలు నిబంధనలు మార్చాయి. గతంలో ఉద్దెరపై పెట్రోల్ బంకులకు పెట్రోల్‌ను సరఫరా చేసేవి. రెండు రోజుల పాటు బంకుల యజమానులకు వెసులుబాటు ఉండేది. కానీ, కొత్త నిబంధన ప్రకారం నగదు ఉంటేనే పెట్రోల్ సరఫరా చేస్తుండడంతో స్టాక్ వచ్చే వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో 169 బంకులు ఉన్నాయి. పెట్రోల్,డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి. వదంతులను నమ్మి ప్రజలు ఇబ్బందులు పడవద్దు. జిల్లాలో సాధారణ అమ్మకాల కంటే రెండు రోజుల్లో 70శాతం అమ్మకాలు పెరిగాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మి ప్రజలు అవసరానికి మించి ఎకువగా కొనుగోలు చేస్తున్నారు. అలా చేయవద్దు. అందరూ సహకరించాలి.
-తనూజ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సిద్దిపేట