ఎంత ఎండకొడితే ఏముంది నిరంతర కరెంట్ సరఫరాతో ఇబ్బందుల లేకుండా పోయాయి. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు నడుస్తుండడంతో వేసవి ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తున్నది. ఇక ఎండలు మండుతున్నా గుంటభూమిలో కూడా ఎక్కడా పంటలు ఎండడం లేదు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వ్యవసాయానికి 24గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ సరఫరా అవుతున్నది. దీంతో రైతులు ధీమాగా పంటలు సాగుచేస్తున్నారు. గడిచిన వానకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో నిరంతర కరెంట్ ఆసరాగా రైతులు బోరుబావుల ద్వారా బంగారు పంటలు పండించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జిల్లాలో గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా అయ్యేది కాదు. నాలుగు నుంచి ఆరుగంటల పాటు విద్యుత్ కోతలు ఉండేవి. ఫలితంగా ప్రజలు, వ్యాపారులు అప్పట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆ సమస్య లేదు. రెండు జిల్లాల్లో 85 సబ్స్టేషన్లు, వందలాది ట్రాన్స్ఫార్మర్లు, కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు కొత్తగా ఏర్పాటు చేయడంతో లోవోల్టేజీ సమస్య తీరింది.
సంగారెడ్డి, మే 4(నమస్తే తెలంగాణ)/మెదక్ : సంగారెడ్డి,మెదక్ జిల్లాల్లో మండు వేసవిలో సైతం నిరంతర 24 గంటల కరెంట్ సరఫరా అవుతున్నది. ఈసారి ఉష్ణోగ్రతలు బాగా నమోదవుతున్నాయి. ఉక్కపోత, వడగాలులు వీస్తున్నాయి. నాణ్యమైన కరెంట్ సరఫరా అవుతుండడంతో ప్రజలకు వేసవి నుంచి ఉపశమనం లభిస్తున్నది. విద్యుత్ సంక్షోభం కారణంగా పొరుగున ఉన్న కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఎగువన ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ర్టాల్లో కరెంటు కోతలు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ దక్షత కారణంగా తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవు. గృహావసరాలతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నది. గృహవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా ఉంది. ప్రస్తుతం ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, నిరంతర విద్యుత్ సరఫరా అవుతుండడంతో ప్రజలు ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు వేసుకుని చల్లగా సేద తీరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 5 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో లక్ష వ్యవసాయ కనెక్షన్లు, 1.90 లక్షలు గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా అయ్యేది కాదు. నాలుగు నుంచి ఆరుగంటల పాటు విద్యుత్ కోతలు ఉండేవి. ఫలితంగా ప్రజలు, వ్యాపారులు కరెంటు కోతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కున్నారు. వేసవికాలంలో ఓవైపు మండే ఎండలు, మరోవైపు విద్యుత్ కోతలతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలు అల్లాడిపోయేవారు. సరైన సంఖ్యలో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు లేకపోవటంతో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కరెంటు కోతలకు చెక్ పెట్టారు. గృహ, వాణిజ్య అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సంగారెడ్డి జిల్లాలో 42 కొత్త సబ్స్టేషన్లు నిర్మించారు. మెదక్‌లోనూ 25 వరకు సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీంతో లోవోల్టేజీ సమస్య తీరింది.
సంగారెడ్డి జిల్లాలో…
ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేది కాదు. జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు బోరుబావుల పైనే ఎక్కువ ఆధార పడుతున్నారు. జిల్లాలో 80 వేల వరకు బోరుబావులు ఉన్నాయి. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంటు కేవలం 6గంటలు రెండు విడుతలుగా సరఫరా అయ్యేది. కరెంటు కోతల కారణంగా యాసంగిలో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడేవారు. కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జూన్ 2014 నుంచి సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయబావులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జూలై 2017 నుంచి సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ బావులకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సంగారెడ్డి జిల్లాలో అనేక చర్యలు చేపట్టింది. 2018-19లో 4404 కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించడంతో పాటు 6830 కిలోమీటర్లు మేర వైర్లు, 41,189 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసింది. 2019-20లో 19,191 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 4,532 కిలోమీటర్ల కొత్త విద్యుత్ వైర్లు, 59,290 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసింది. 2020-21లో 1438 కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించడంతో పాటు 1916 కిలోమీటర్ల కొత్తవైర్లు, 15,013 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసింది. 2021-22లో 344 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, 600 కిలోమీటర్ల విద్యుత్ వైరు, 321 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా జిల్లాలో విద్యుత్ సరఫరా పెరగటంతో పాటు లోవోల్టేజీ సమస్యలు తొలిగిపోయాయి. ప్రస్తుత వేసవిలో సైతం వ్యవసాయ బావులకు నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నది. బోరుబావుల కింద రైతులు వరి, చెరుకు పంటలు వేశారు. వరి కోతలు కోస్తున్నారు. చాలామంది రైతులు బోరుబావుల కింద కూరగాయలను సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో లక్ష వ్యవసాయ కనెక్షన్లు, 1.90 లక్షలు గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు. పంటల సాగు, ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రెప్పపాటున కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడంలేదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. రైతులకు సాధారణ ట్రాన్స్ఫార్మర్లతో పాటు అదనంగా సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వం అందించింది. మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు కూడా పెరిగిన నేపథ్యంలో పంటల సాగుకు ఏ ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది.
కర్ణాటకలో ఇక్కట్లు…
సంగారెడ్డి జిల్లాకు పొరుగునే కర్ణాటక రాష్ట్రం ఉంది. తెలంగాణ సరిహద్దులో బీదర్ జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుతం కరెంటు కోతలు అమలవుతున్నాయి. వ్యవసాయ బావులకు ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా అవుతున్నది. ఒక వారంలో ఉదయం 9గంటల నుంచి సాయం త్రం 4 వరకు వ్యవసాయ బావులకు త్రీ ఫేజ్ కరెంటు సరఫరా అవుతున్నది. మరోవారం రాత్రి 9గంటల నుంచి ఉదయం 4వరకు రాత్రివేళల్లో కరెంటు సరఫరా చేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బీదర్ జిల్లాలోని రైతులు ఎక్కువగా చెరుకు పంటను సాగుచేస్తున్నారు. చెరుకు సాగునీరు అవసరమైన తరుణంలో కరెంటు కోతలు ఉండడంతో రైతులు పంట ఎండిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు సైతం కరెంటు కోతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో కరెంటు సరఫరా చేస్తుండటంతో కష్టపడాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే.. కర్ణాటక ప్రభుత్వం వ్యవసాయ బావులు వద్ద కరెంటు మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్నది. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు బిగించడంపై రైతుల్లో నిరసన వ్యక్తం అవుతున్నది. బీజేపీ ప్రభుత్వం పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో గృహాలకు సైతం అధికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. గృహాలకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు అప్రకటిత విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. వేసవిలో కరెంటు కోతల కారణంగా బీదర్ జిల్లాలోని గ్రామీణ ప్రజలతో పాటు పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరెంట్ కోతలు లేవు
తెలంగాణ రాష్ట్రం వచ్చినంక అసలే కరెంట్ కోతలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎండకాలంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతదో తెల్వకపోతుండె. పంట పొలా లకు సాగు నీరు అందించేందుకు రాత్రుల్లో పొలం వద్దనే జాగరణ చేయాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరంతరాయంగా 24 గంటల పాటు ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ సరఫరా అవుతున్నది. ప్రస్తుత ఎండకాలంలో పంట పొలాలకు సకాలంలో నీరు అందించడంతో పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. పక్కనే ఉన్న రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళికతో కరెంట్ సమస్యను లేకుండా చేసిండు. నిరంతరరాయంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంతో రైతులు, ప్రజలందరూ సంతోషంగా గడుపుతున్నారు.
-పూర్ణచందర్, ఖలీల్పూర్, న్యాల్కల్ మండలం
సాగుకు 24 గంటల కరెంటు
గత ప్రభుత్వ పాలనలో రైతులకు వ్యవసాయ సాగుకు కరెంటు సర ఇవ్వక పోవడంతో రైతులు పంటలు సక్రమంగా సాగు చేసుకోలేక పోయేవారు. ఎంతో మంది రైతులు అత్మహత్యలు చేసుకున్నారు. 2014 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ సాగుకు కరెంట్ ఇవ్వలేక పోవ పంటలు సక్రమంగా పండించుకోలేక తీవ్రంగా అప్పులపాలయారు. సీఎం కేసీఆర్ పరిపానలో రైతులకు వ్యవసాయ రంగానికి , వ్యాపారస్తులు, చిన్నచిన్న కుటీర పరిశ్రమలు, పేదవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటల కరెంటును సరఫరా చేయడం అభినందనీ ఇలాంటి సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం రైతుల అదృష్టం.
– సంజీవరెడ్డి, రైతు (సిద్దాపూర్ , ఝరాసంగం మండలం)
మోటార్లు తక్కువగా కాలుతున్నాయి
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రైతులకు కరెంట్ మంచిగా ఇస్తున్నరు. ఇప్పుడు నాణ్యమైన కరెంటును ఇస్తున్నరు కాబట్టి బోరుబావుల మోటార్లు ఎక్కువగా కాలిపోవడం లేదు. మాకు కొంత వరకు పనులు కూడా తగ్గాయి.
అక్రాం, మద్రి మెకానిక్, కోహీర్ మండలం
కాలిన మోటర్లు రావడం లేదు
గతంలో రైతుల కరెంటు మోటా ర్లు కాలిపోవడంతో మాకు చేతినిండా పనులు దొరికేవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం 24 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వడంతో రెతుల వద్ద ఉన్న కరెంటు మోటార్లు కాలిపోవడం లేదు.
-మోహన్, మెకానిక్, రాయికోడ్