నారాయణఖేడ్, నవంబర్ 16: అత్యవసర పరిస్థితుల్లో బాధితులను దవాఖానకు చేర్చే 108 అంబులెన్స్‌లు అత్యవసర మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. అధికారుల పట్టింపులేని తనం మారుమూల ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో మారుమూలన వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నారాయణఖేడ్ డివిజన్లోని 7 మండలాలకు ప్రస్తుతం ఐదు మండలాలకు మాత్రమే 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
నాగల్గిద్ద, నిజాంపేట్ మండలాలకు అంబులెన్స్‌లు సమకూర్చకపోవడంతో ఆయా మండలాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నారాయణఖేడ్, మనూరు 108 అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గిరిజన తండాలు అధికంగా ఉన్నాయి. నాగల్గిద్ద మండలం మారుమూలన ఉంటుంది. నిజాంపేట్ మండలం గుండా జాతీయ రహదారి వెళ్తున్నది. ఈ మండలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా అంబులెన్స్‌లు అందుబాటులోకి లేకపోవడం గమనార్హం. నారాయణఖేడ్, నిజాంపేట్, మనూరు, నాగల్గిద్ద మండలాలకు రెండు అంబులెన్స్‌లు మాత్రమే సేవలందిస్తుండడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అంబులెన్స్ అందుబాటులో లేని సందర్భాల్లో బాధితులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.ఇది పేదలకు భారంగా మారుతున్నది.
అత్యవసర సేవలను దృష్టిలో ఉంచుకుని పూర్తి కండీషన్లో ఉన్న వాహనాలను వినియోగించాల్సి ఉండగా, కాలం చెల్లిన వాహనాలు వినియోగిస్తుండడంతో తరుచూ మార్గమధ్యలో మొరాయిస్తున్నాయి. 108 అంబులెన్స్‌లు అత్యవసర సేవల్లో భాగంగా సంగారెడ్డి, బీదర్ దవాఖానలకు ఎక్కువగా రాకపోకలు సాగిస్తాయి. రోగులు, క్షతగాత్రులను అంబులెన్స్‌లో తరలిస్తున్న క్రమంలో వాహనం మొరాయిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయా వాహనాల్లోనూ పూర్తిస్థాయిలో వసతులు అందుబాటులో ఉండడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వాహనాల్లోని పలు పరికరాలు పని చేయడం లేదని తెలుస్తుంది. ఇక వాహనాల నిర్వహణ విషయంలోనూ పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సమయానికి రాక ఇబ్బందులు వస్తున్నాయి. వేరే మండలాలకు ఉన్నట్టు మా మండల ప్రజల కోసం ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మా మండలంలో ఎక్కువగా మారుమూల గ్రామాలు, తండాలు ఉన్నాయి. రాత్రిపూట దవాఖానకు పోవాల్సి వస్తే కష్టమవుతున్నది. ఆపత్కాలంలో 108కు ఫోన్ చేస్తే వేరే మండలానికి సంబంధించిన అంబులెన్స్ వస్తుంది. చాలాసార్లు అంబులెన్స్ రావడానిరి ఆలస్యమవుతున్నది. దీంతో ప్రైవేట్ వాహనదారులను బతిమాలుకుని పోవాల్సి వస్తున్నది. ప్రజల బాధలను అర్థం చేసుకుని మా మండలానికి సెపరేట్‌గా 108 అంబులెన్స్ ఏర్పాటు చేయాలి.
– మారుతి చౌహాన్, కరస్‌గుత్తి, నాగల్గిద్ద మండలం (సంగారెడ్డి జిల్లా)
నిజాంపేట్ మండల పరిధిలోని ప్రజల కోసం 108 అంబులెన్స్‌ను అందుబాటులోకి తేవాలి. అత్యవసర పరిస్థితుల్లో నారాయణఖేడ్, కల్హేర్ మండలాల 108 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. ప్రత్యేకంగా నిజాంపేట్ మండలానికి ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది. మా మండల ప్రజలకు ఏదైనా అత్యవసరం వస్తే అంబులెన్స్‌లు లేక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది.
– జగదీశ్వర్‌చారి, మాజీ సర్పంచ్, నిజాంపేట్ (సంగారెడ్డి జిల్లా)