న్యాల్కల్, సెప్టెంబర్ 11: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ఉ త్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో ఎర్రరాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గణేశ్‌పూర్, న్యామతాబాద్, మల్కన్పాడ్, రేజింతల్, హద్నూర్ గ్రామ శివారుల్లో ఇష్టారాజ్యంగా ఎర్రరాయి తవ్వకాలు జరుగుతున్నా నిమ్జ్ ప్రాజెక్టు, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరు అక్రమార్కులు ఎర్రరాయిని తవ్వి కర్ణాటక, మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా సాగుతున్న ఈ దం దాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. అంతేకాకుండా వ్యవసాయానికి అనుకూలం గా లేక రైతులు బీడుగా వదిలేసిన భూముల్లో సైతం అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. భూముల రైతులకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి ఎర్రరాయి ని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జేసీబీ, హిటాచిలతో మట్టిని తొలిగించి ఎర్రరాయిని వెలికి తీసి ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు. నిర్మాణ రంగంలో ఎర్రరాయికి మంచి గిరాకీ ఉండడంతో అక్రమార్కులు బాగా సంపాదిస్తున్నారు.
ప్రభుత్వ, పట్టా భూముల్లో ఎర్రరాయి తవ్వకాలు జరపాలంటే తహసీల్ కార్యాలయం నుంచి ఎన్వోసీ తీ సుకుని మైనింగ్ శాఖ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకు తగిన ఫీజు చెల్లించిన తర్వాతే అనుమతితో ఎర్రరాయి తవ్వకాలు జరపాలి. కానీ, ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎర్రరాయి అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు చూస్తారని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే మైనింగ్ అధికారులు చూస్తారని చేతులు దులిపేసుకుంటున్నారు.
దీంతో అక్రమ వ్యాపారానికి అడ్డుపడడం లేదు. ఈ విషయాన్ని న్యాల్కల్ తహసీల్దార్ భూపాల్ దృష్టికి నమస్తే తెలంగాణ తీసుకెళ్లగా.. ఎర్రరాయి తవ్వకాల వ్యవహారం మైనింగ్ శాఖ అధికారులే చూసుకుంటారని పేర్కొన్నారు. ఎర్రరాయి అక్రమ తవ్వకాలపై జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.