ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. 2024కు చిన్నా పెద్ద అట్టహాసంగా స్వాగతం పలికారు. కేక్‌లు కట్‌చేసి నోరు తీపి చేసుకున్నారు. అలయ్ బలయ్‌తో శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. డిసెంబర్ 31 రాత్రి హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు కిక్కిరిసిపోయాయి. అర్ధరాత్రి 12 దాటగానే యువత బైక్‌లతో రోడ్లపైకి వచ్చి న్యూ ఇయర్ విషెస్‌తో హోరెత్తించింది. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు న్యూ ఇయర్ శుభాక్షాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు తీసుకోబోయే నిర్ణయాలు వారి అభ్యున్నతికి దోహదపడాలని ఆక్షాంక్షించారు.
చిలిపిచెడ్, జనవరి 1 : మండలంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం 2024 కొత్త సంవత్సరం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామ శివారు మంజీరానది సమీపంలో వెలసిన చా ముండేశ్వరీ అమ్మవారిని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.
రామాయంపేట, జనవరి 1 : పట్టణంలోని దత్తాత్రేయ, వెంకటేశ్వర, నగరేశ్వర, భక్త మార్కండేయ తదితర దేవాలయాల్లో భక్తులు పూజల కోసం పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వాములవారికి అభిషేకాలు నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పూజారి కూర్మాచలం శ్రీనివాస్ చారి నేతృత్వంలో స్వాముల వారికి పూజా కార్యక్రమా లు నిర్వహించారు.
శివ్వంపేట, జనవరి 1 : మండలంలోని ప్రధాన ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. చాకరిమెట్ల శ్రీసహకార సీతారామాంజనేయస్వామి, బగలాముఖి శక్తిపీఠం, సికింద్లాపూర్ శ్రీలక్ష్మీనర్సింహస్వామి, దొంతిలో శ్రీవేణుగోపాలాస్వామి దేవాలయాల్లో భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ భాస్కర రాయిని ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.