పటాన్చెరు, ఏప్రిల్ 12: పటాన్చెరు బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జిగా వెన్నవరం ఆదర్శ్‌రెడ్డిని ఇటీవల కేసీఆర్ నియమించారు. ఆదర్శ్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. దీనికోసం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.
ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు ఆదర్శ్‌రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీసంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు మండల కేంద్రాలు, గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు.
రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి భారీ జనసమీకరణ చేసేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు నాయకులకు నిత్యం దిశానిర్దేశం చేస్తున్నారు. పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల నుంచి భారీగా జనసమీకరణకు నేతలు కృషిచేస్తున్నారు. రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, గ్రామాల్లో వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు. బ్రిడ్జిలకు, గోడలకు, రోడ్లపక్కన, ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు వాల్ రైటింగ్ రాయిస్తున్నారు.
భారీ జనసమీకరణ చేస్తాం..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరంగల్ రజతోత్సవ సభకు భారీగా జనసమీకరణ చేస్తాం. పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీగా నాయకులను, కార్యకర్తలను తరలించేందుకు గ్రామాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాం. మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనలతో పార్టీకి నియోజకవర్గంలో పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సైనికుల్లా పనిచేస్తున్నాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలను తెలిపి బీఆర్ఎస్ను బలోపేత్తం చేస్తాం. వరంగల్ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. అందరి సహకారంతో రజతోత్సవ సభను విజయవంతం చేస్తాం.
– ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి