చేర్యాల, సెప్టెంబర్ 10 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న కుడి చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. రియల్ వ్యాపారుల అక్రమణలతో ఉనికి కోల్పోయిన చేర్యాల కుడి చెరువును పరిరక్షించాలని పట్టణ ప్రజలు సర్కారును కోరుతున్నారు. వరంగల్ జిల్లాలో కొనసాగిన సమయంలో నాటి పాలకులు చెరువును కాపాడాలని ఆదేశాలు ఇచ్చినా స్థానిక అధికారులు కాసులకు కక్కుర్తిపడి చెరువును కాపాడే చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ సర్కారు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే కుడి చెరువుకు పూర్వ వైభవం రానున్నది.
25వేల జనాభా కలిగిన చేర్యాల పట్టణానికి కీలకమైన ఈ చెరువు ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శిఖాన్ని ఆనుకుని అక్రమ లేఔట్ చేసి ఎత్తు గా వేలాది ట్రిప్పుల మొరం, మట్టి నింపి వేయడంతో చెరువులోకి వరద వచ్చే మార్గం లేక కుడి చెరువు కాస్తా ఉనికి లేకుండా పోయింది.చిన్న నీటి పారుదలశాఖ పరిధిలో ఉన్న చేర్యాల కుడి చెరువుకు సర్వే నెం. 202లో 60.21 ఎకరాల శిఖం భూములు ఉన్నాయి. శిఖం ఆనుకుని సర్వేనెం.199,200,201,203,204,205, 1461, 462,1456,1457,1458,1459,1460లో సుమారు 39 ఎకరాల పట్టాభూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ భూములను పలువురు రైతులు సాగు చేసుకుంటున్నారు. వర్షాకాలంలో చెరువు నుంచి సమీపంలోని బస్టాండ్, చేర్యాల-సిద్దిపేట ప్రధాన రహదారి వరకు వర్షపునీరు నిల్వ ఉం టుంది. ఈ సమయంలో రైతులు వ్యవసాయం చేయని పరిస్థితి నెలకొంది.రియల్ వ్యాపారం జోరుగా సాగిన సమయంలో (రియల్ వ్యాపారి) దాదాపు కోటి రూపాయలకు ఎకరా చొప్పున 203 సర్వే నంబర్లో కొంత భూమిని పట్టాదారుల నుంచి కొనుగోలు చేశాడు. లేఔ ట్ కోసం 8.24 ఎకరాల భూమార్పిడి కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు ప్రభుత్వ అనుమతి రాక ముందే ప్లాటింగ్ చేశారు.
పూర్వ వైభవం కోసం ఎదురు చూపులు
జిల్లాల పునర్విభజనకు ముందుకు జనగామ ఆర్డీవో చెరువు శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలిగించాలని ఆదేశాలు జారీ చేశారు. చెరువు శిఖం ఆనుకుని పోసిన మట్టిని సైతం తొలిగించాలని జిల్లా పంచాయతీ అధికారులకు నివేదిక సైతం పంపించారు. కానీ ఐబీ, రెవెన్యూ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించడంతో కుడి చెరువు పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా తయారైంది. కొన్నేండ్లుగా వర్షాలు జోరుగా కురుస్తుండడంతో చెరువులోకి నీళ్లు వచ్చే మార్గాల్లో నిర్మాణాలు ఉన్నాయి. దీంతో చెరువులోకి కొద్దికొద్దిగా నీళ్లు వచ్చాయి. అధికారులు స్పందించి కుడి చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని, చెరువు శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలు తొలిగించాలని పలువురు కోరుతున్నారు.
నిబంధనలకు నీళ్లు
చెరువు శిఖం ఉన్న ప్రభుత్వ భూములతోపాటు పట్టాభూములైనా వ్యవసాయానికి వినియోగించాలే తప్పా వ్యాపారం చేయవద్దనే నిబంధనలు ఉన్నాయి. కానీ ఆయా శాఖల అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా లేఔట్లో ప్లాట్లు చేసి విక్రయించడంతో పలువురు నిర్మాణాలు చేసుకున్నారు. నాడు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మరికొన్ని నిర్మాణా లు నిలిచిపోయాయి. పూర్తి స్థాయిలో నిర్మాణాలు కొనసాగిస్తే చెరువులోకి చుక్కనీరు రాని పరిస్థితి.
చెరువు పరిస్థితి దుర్భరంగా మారినా రెవె న్యూ, ఐబీ అధికారులు మాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. గతంలో కొందరు స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టి మధ్యలో వదిలిపెట్టారు. మరికొందరు నిర్మాణాలు పూర్తి చేశారు. వ్యాపార అవసరాల పేరిట కొందరు చెరువు భూమిని కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదే భూములకు రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్వర్షన్ ఇవ్వడంతో పలువురు దర్జాగా నిర్మాణాలు చేపట్టారు.
రక్షణకు చర్యలు తీసుకుంటాం
చేర్యాల పట్టణంలో ఉన్న కుడి చెరువు రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం. గతంలో చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణతోపాటు హద్దులు ఏర్పాటు చేశాం. ఆక్రమణకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిర్మాణాలు ఉంటే తొలిగిస్తాం. చెరువులోకి నీళ్లు వచ్చే అన్ని మార్గాలు సరి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– శ్యామ్, ఐబీ డీఈ చేర్యాల, సిద్దిపేట జిల్లా