పటాన్చెరు రూరల్, జూలై 8: పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం సభ్యులు పర్యటించారు. ఐదుగురు సభ్యుల సీనియర్ సభ్యుల బృందానికి బ్రిగేడియర్, రవీందర్ గురుంగ్ (రిటైర్డు) నాయకత్వం వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్డీఎంఏ) అధికారులు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, సంగారెడ్డి ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో కలిసి పరిశ్రమను పరిశీలించారు.
పరిశ్రమలో భారీ ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేయడంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. పేలుడు సమయంలో భద్రతా ప్రమాణాలు, గతంలో జరిగిన తనిఖీల వివరాలను సేకరించారు. ప్రమాద సమయంలో ఎంతమంది కార్మికులు లోపల ఉన్నారు, ఎటువైపు ప్రమాదం తీవ్రత కనిపించింది, మృతిచెందిన వారి సంఖ్య, పరిశ్రమలో క్షతగాత్రుల వివరాలు, కంపెనీలో తయారయ్యే మెటీరియల్, దానికి వాడే సామగ్రి, కెమికల్స్, ప్రాసెసింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.
ప్రొడక్షన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర టెక్నికల్ అంశాలను భద్రతా అధికారులను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పక్కనే ఉన్న విరూపాక్ష కంపెనీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. వారి వెంట ఐలా పూర్వ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పరిశ్రమల శాఖ, అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖ, పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు.
పాశమైలారం పారిశ్రామికవాడలోని ఐలా భవనంలోని సిగాచి పరిశ్రమలో పేలుడులో కనిపించకుండా పోయిన కార్మికులు, స్టాఫ్ కుటుంబాలకు అధికారులు ఆశ్రయం కల్పించారు. తొమ్మిది రోజులుగా తమ వ్యక్తి కనిపించకుండా పోయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మావాడు ఉన్నాడా.? లేడా? అంటూ నిలదీస్తున్నారు. అధికారులు తమ చేతిలో ఏమీలేదని, మీరు కూడా చూస్తున్నారుగా పరిస్థితిని, మేము కూడా బాధపడుతున్నామంటూ బాధిత కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను తమవారి ఆచూకీ త్వరగా చూపించాలని, బాధిత కుటుంబాల వారు విన్నవించారు. మిస్సింగ్ అయిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఐలా భవనం వద్ద నిరీక్షిస్తున్నారు. మరోపక్క సిగాచి పరిశ్రమ ధ్వంసమైన శిథిలాలను పారవేసిన చోట హైడ్రా, ఇతర శాఖల సిబ్బంది మనుషుల ఆధారాల కోసం వెతుకుతున్నారు. మంగళవారం మూడు చిన్నపాటి మావన అవయవాలు లభించినట్లుగా తెలుస్తున్నది. వీటిని తక్షణమే అంబులెన్స్‌లో పటాన్చెరు ఏరియా దవాఖానకు పంపిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి వాటిలో మిస్సైన వ్యక్తుల డీఎన్ఏ ఉంటే అధికారులు వాటి వివరాలు ప్రకటిస్తారు.