మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 12: విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే విజ్ఞానశాస్త్రంపై అవగాహన కల్పించడంతో పాటు బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ అన్నారు. ఈ నెల 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పాఠశాలల్లో పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో విజ్ఞాన శాస్త్ర పోటీలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలకు డీఈవో రాధాకిషన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇలాంటి పోటీల వల్ల విద్యార్థుల్లోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయన్నారు. జిల్లా స్థాయిలో నాలుగు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతి విభాగంలో ముగ్గురు చొప్పున 12 మంది ఉత్తమ విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించే సైన్స్ దినోత్సవ పోటీల్లో వీరంతా జిల్లా తరపున పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నీలకంఠం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ, గైడ్ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.