పటాన్చెరు టౌన్, మే 11 : ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని, స్వీయ రక్షణకు విద్యార్థినులు, మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. కరాటే ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం లభిస్తుందని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని భారతరత్న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక పదో జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీల ముగింపు సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి సుమన్ బహుమతులు అందజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ర్టాల క్రీడాకారులు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ హీరో సుమన్ మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. పదేండ్లుగా జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు సహకారం అందించడం గొప్ప నిర్ణయం అని అభినందనలు తెలిపారు.
తాను విద్యార్థి దశ నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ప్రారంభించినట్లు చెప్పారు.చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా ఏడాది పొడవునా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు పటాన్చెరు కేంద్రంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్, షకీల్, రామ్మోహన్, వినోద్‌రెడ్డి, నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.