హత్నూర, మార్చి4: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ వావిలాల నర్సింహులు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశానికి పలుశాఖల అధికారులు గైర్హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలకోసారి నిర్వహించే మండల సమావేశానికి అధికారులు హాజరుకాకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్య గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల సమావేశానికి గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీచేయాలని ఎంపీడీవో శంకర్‌కు సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరవికుమార్, తహసీల్దార్ ఫర్హీన్‌షేక్, ఆయాశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హత్నూర మండలం నస్తీపూర్ గ్రామానికి చెందిన కొడిపాక రాములుకు అత్యవసర చికిత్స కోసం రూ.లక్షా20వేల ఎల్వోసీని బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లకోసం సేకరించిన దరఖాస్తులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు శివశంకర్‌రావు పాల్గొన్నారు.